Israel-Hamas war: తిరుగుబాటు గళానికి స్వేచ్ఛ

26 Nov, 2023 05:43 IST|Sakshi
8 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు మారా (ఎడమ)

రమల్లా: ఆమె పేరు మారా. పాలస్తీనా యువతి. వయసు 24 ఏళ్లు. కానీ ఎదిగే దశలో అత్యంత కీలకమైన 8 ఏళ్లు ఇజ్రాయెల్‌ చెరలో జైలు గోడల నడుమ గడిపింది! వందేళ్లకు సరిపడా అనుభవాలు చవిచూసింది. టీనేజీలో అత్యంత అవసమైన అమ్మ ఆసరా కోసం ఎంతగానో అంగలార్చింది. అలాగని ధైర్యం మాత్రం కోల్పోలేదు. ఉత్తర ఇజ్రాయెల్‌లో తనను ఉంచిన డామన్‌ జైల్లోని పాలస్తీనా మహిళలు, మైనర్ల తరఫున గళమెత్తింది.

చూస్తుండగానే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కీలక రాజకీయాంశంగా కూడా మారిపోయింది. దాంతో అక్టోబర్‌ 7న హమాస్‌ మెరుపుదాడి అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మారాను మరో జైలుకు మార్చి ఇతరులతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా ఉంచింది ఇజ్రాయెల్‌ ప్రభుత్వం! బందీల పరస్పర విడుదలలో భాగంగా శుక్రవారం ఇజ్రాయెల్‌ వదిలిపెట్టిన 39 మంది పాలస్తీనియన్లలో ఆమె కూడా ఉంది. లాంఛనాలన్నీ పూర్తై ఎట్టకేలకు శుక్రవారం రాత్రి విడుదలై రమల్లా చేరింది.

తల్లి సౌసన్‌ అప్పటికే అక్కడ ఆమె కోసం క్షణమో యుగంగా ఎదురు చూస్తోంది. కూతురు వాహనం దిగుతూనే పరుగెత్తుకెళ్లి ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. ఎనిమిదేళ్ల ఎడబాటును తలచుకుంటూ వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లీకూతుళ్ల కలయికను చూసిన వాళ్లందరిలోనూ హర్షాతిరేకాలు పెల్లుబికాయి. ‘‘నేను చెప్పలేదూ! నా కూతురు పోరాటాలతో రాటుదేలి అంతర్గత సౌందర్యంతో మెరిసిపోతోంది’’ అని పాలస్తీనా మీడియాతో చెబుతూ మురిసిపోయింది సౌసన్‌.

స్కూలుకు వెళ్తుండగా...
మారా స్వస్థలం ఇజ్రాయెల్‌ నిర్బంధంలో ఉన్న తూర్పు జెరూసలేం. కొద్ది దూరంలోని స్కూలుకు వెళ్లే క్రమంలో తూర్పు, పశి్చమ జెరూసలేం మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌ వేను దాటాల్సి వచ్చేది. 2015 అక్టోబర్లో 16 ఏళ్ల టీనేజర్‌గా స్కూలుకు వెళ్తుండగా ఎక్స్‌ప్రెస్‌ వే మీద ఇజ్రాయెల్‌ సైన్యం ఆమెపై కాల్పులకు దిగింది. గాయాలతో పడున్న మారాను అరెస్టు చేసింది.

ఇజ్రాయెలీ సైనికాధికారిని పొడిచేందుకు ప్రయతి్నంచిందన్న అభియోగాలపై ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష పడింది. చేతిని తూట్లు పొడిచిన 12 తూటా గాయాలు శాశ్వతంగా అవిటిగా మార్చేశాయి. జైల్లో రోజులు అత్యంత దుర్భరంగా గడిచాయి. ముఖ్యంగా ఓ టీనేజర్‌గా తల్లి తోడు అత్యంత అవసరమైన తొలి రోజులు!’’ అని తల్లి చేతులను గట్టిగా పట్టుకుంటూ గుర్తు చేసుకుంది మారా. కష్టాన్నైనా తట్టుకునే శక్తిని కూడా ఇచ్చాయని చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు