పిల్లల చదువు బెంగ తీరింది

25 Dec, 2023 03:45 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

పిల్లల చదువు బెంగ తీరింది 
మాకు ముగ్గురు పిల్లలు. వారికి మూడు పూటలా కడుపునిండా తిండి పెట్టడానికి నేను, మా ఆయన చాలా కష్టపడుతున్నాం. ఇక పిల్లలకు చదువెలా చెప్పిస్తాం? మాది నిరుపేద గిరిజన కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బీరపాడు మా గ్రామం. మా వూరి మేస్టారు వచ్చి పిల్లల్ని బడికి పంపిస్తే ప్రభుత్వం డబ్బులిస్తుందనీ, మధ్యాహ్నం భోజనం పెడతారని చెప్పడంతో పిల్లల్ని బడికి పంపిస్తున్నాం.

ఇప్పుడు పెద్దమ్మాయి లాస్య ఐదో తరగతి, బాబు వికాస్‌ రెండో తరగతి చదువుతున్నారు. ఈ ప్రభుత్వం అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున లాస్యకు నాలుగేళ్లుగా డబ్బు అందిస్తోంది. మధ్యాహ్నం వారిద్దరికీ రుచికరమైన భోజనం పెడుతున్నారు. ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు, బెల్ట్, బ్యాగు ఇచ్చారు. మరోబాబు విక్రమ్‌ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. అక్కడ పౌష్టికాహారం, వైద్యం అందుతోంది. ఇప్పుడు మా పిల్లల చదువు బెంగ తీరింది.  – కిల్లక భారమ్మ, బీరపాడు  (దత్తి మహందాత నాయుడు, విలేకరి, పార్వతీపురం)  

కూరగాయల వ్యాపారంతో ఉపాధి 
నా భర్త నీలకంఠం కూలి పని చేస్తారు. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరు పిల్లలు గల ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. నేను ఏదైనా వ్యాపారం చేద్దామన్నా పెట్టుబడి లేక అది కుదరలేదు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన మేము గత టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. అధికారుల చుట్టూ తిరిగినా వారు కరుణించలేదు.

జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సులతోనే రుణాలు ఇవ్వడంతో మాకు అన్యాయం జరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 నేరుగా లబ్ధిదారుల ఖాతాకే జమ చేశారు. ఆ పథకం ద్వారా తొలి విడతగా తీసుకున్న నగదుతో గ్రామంలోనే కూరగాయల దుకాణం ప్రారంభించా. ప్రస్తుతం రోజుకు రూ.300 వరకు ఆదాయం వస్తోంది. దీంతో కుటుంబానికి చేదోడుగా ఉంటున్నా. ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి ఇంటి వద్దే ఉంటున్న నాకు వైఎస్సార్‌ చేయూత పథకంతో ఓ ఆధారం దొరికింది.   – మొగలపూరి హైమావతి, సమిశ్రగూడెం (గాడి శేఖర్‌బాబు, విలేకరి, నిడదవోలు) 

పింఛన్‌ ఇంటికే వస్తోంది 
నాకు పూర్తి స్థాయిలో కళ్లు కనిపించవు. అంధత్వ సమస్య వల్ల బయటకు వెళ్లలేను. పని చేస్తేగాని కుటుంబం గడవని పరిస్థితి. నా భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో విశాఖ నగరంలోని ఆరిలోవ టీఐసీ పాయింట్‌ వద్ద ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఈ  ప్రభుత్వం వచ్చాక నాకు దివ్యాంగ పింఛను మంజూరైంది. రూ.3,000 చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్‌ ఇంటికి వచ్చి అందిస్తున్నారు. ఆ డబ్బుల వల్ల ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు తీరుతున్నాయి.

గతంలో తరుచూ అప్పులు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మాకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మాణంలో ఉంది. నా భార్య కూలి పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. పెద్ద కుమార్తె ప్రభుత్వ ఉమెన్స్‌ కాలేజీలో ఇంటరీ్మడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు నాలుగేళ్లుగా జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున వస్తోంది. ఆ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మా లాంటి పేదోళ్లకు పిల్లలను చదివించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి.     – గుడ్ల వెంకటరెడ్డి, ఆరిలోవ, విశాఖపట్నం (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ, విశాఖపట్నం) 

>
మరిన్ని వార్తలు