వేల్చేరుకు అత్యున్నత సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌

27 Feb, 2021 04:07 IST|Sakshi

తెలుగు వాడికి అరుదైన గుర్తింపు 

ఇప్పటివరకు ఎంపికైన వారిలో ఈయన 14వ వ్యక్తి 

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశిష్ట సాహితీవేత్త 

గవర్నర్, సీఎం సహా పలువురు సాహితీవేత్తల హర్షం 

చాలా సంతోషంగా ఉంది : వేల్చేరు  

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/శ్రీకాకుళం/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట):  సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు విశిష్ట పండితుడు, రచయిత, అనువాదకులు, విమర్శకులు ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు. అకాడమీ అధ్యక్షులు డాక్టర్‌ చంద్రశేఖర్‌ కంబర్‌ అధ్యక్షతన సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ 92వ సమావేశంలో వేల్చేరు నారాయణరావును ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు. ఆయన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు ఎన్నికైన 14వ పండితుడని అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేల్చేరు నారాయణరావు తెలుగు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించారు. గరల్స్‌ ఫర్‌ సేల్‌ : కన్యాశుల్కం, ఏ ప్లే ఫ్రమ్‌ కొలొనియల్‌ ఇండియా, గాడ్‌ ఆన్‌ హిల్‌ : టెంపుల్‌ సాంగ్స్‌ ఫ్రమ్‌ తిరుపతి, టెక్స్చర్స్‌ ఆఫ్‌ టైమ్‌ : రైటింగ్‌ హిస్టరీ ఇన్‌ సౌత్‌ ఇండియా, హైబిస్కస్‌ ఆన్‌ ది లేక్‌ : ట్వంటీయత్‌ సెంచరీ తెలుగు పోయెట్రీ ఫ్రమ్‌ ఇండియా వంటి ఆంగ్ల పుస్తకాలు రాశారు.

దక్షిణ భారత సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. జెరూసలేంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఆఫ్‌ హిబ్రూ యూనివర్సిటీలో, మాడిసన్‌ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హ్యుమానిటీస్‌లో ఫెలోగా ఉన్నారు. అనువాద రచనలకు గాను ఆయన ఏకే రామానుజన్‌ బహుమతి అందుకున్నారు. అలాగే, రాధాకృష్ణన్‌ మెమోరియల్‌ పురస్కారాన్ని స్వీకరించారు. తెలుగు సాహిత్యాన్ని ఆయన ఆంగ్లంలోకి అనువాదం చేసి తెలుగు భాష ఘనతను విశ్వవ్యాప్తం చేశారు. అలాగే, అనేక వర్శిటీలు ఆయన పుస్తకాలకు గుర్తింపునిచ్చి వాటి లైబ్రరీల్లో స్థానం కల్పించాయి. కాగా, ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై వేల్చూరి నారాయణరావు సంతోషం వ్యక్తంచేశారు. 

సాహితీరంగానికి వేల్చూరి విశేష కృషి : గవర్నర్‌ 
సాహితీ రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమి గౌరవ ఫెలోషిప్‌కు ఎంపికైన వేల్చూరి నారాయణరావును గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. తెలుగు, సంస్కృత సాహితీరంగాల్లో ఆయన విశేష కృషిచేశారని కొనియాడారు. సాహితీ పరిశోధన రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారని శుక్రవారం ఓ ప్రకటనలో గవర్నర్‌ పేర్కొన్నారు. ఆంగ్లంలోకి అనువదించడం ద్వారా తెలుగు, సంస్కృత సాహిత్య గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు.  

సీఎం జగన్‌ అభినందనలు 
వేల్చేరు నారాయణరావును సీఎం వైఎస్‌ జగన్‌ కూడా అభినందించారు. సాహిత్య రంగానికి ఆయన విశేష సేవలు అందించారని ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అనువాదాలు, సాహితీ పరిశోధన రంగంలో ఆయన విశేష కృషిచేశారని కొనియాడారు. 

ఫెలోషిప్‌కు ఆయన తగిన వ్యక్తి 
ఇదిలా ఉంటే.. వేల్చేరు నారాయణరావు ఈ అరుదైన ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై ప్రముఖ సాహితీవేత్తలు, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు బోర్డు కన్వీనర్‌ శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్‌లు అభినందించారు. అలాగే, నారాయణరావు తెలుగు నుంచి ఇంగ్లి‹Ùకు చాలా అనువాదాలు చేశారని.. ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడ కన్యాశుల్కాన్ని ఆంగ్లంలోకి అనువదించారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్య భూమిక వహించారని.. ఈ పురస్కారానికి ఆయన ఎంతైనా తగిన వ్యక్తి అని ప్రశంసించారు. 

సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌.. 
దేశంలోని ఉద్ధండ సాహితీవేత్తలను మాత్రమే సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికచేస్తారు. ఈ పురస్కారాలు ప్రకటించే ప్రతీసారి ఇరవై మంది లేదా అంతకు తక్కువ మందిని ఎంపిక చేస్తారు. 1968 నుంచి 2018 వరకు సుమారు వంద మంది వరకు ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. 

సాహిత్య అకాడమీ అవార్డు.. 
దేశంలోని సాహితీవేత్తలు రచించిన అత్యుత్తమ రచనలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశం లో ని 24 ప్రధాన భాషల్లో మాత్రమే రచనలై ఉండాలి. 

గౌరవ ఫెలోషిప్‌లు ఎవరికి ఇస్తారంటే.. 
ఇది సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత పురస్కారం. భారత పౌరులు కాని వారిని మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు. ఈ ఫెలోషిప్‌కు ఇప్పటివరకు 13మంది ఎంపికయ్యారు.  వారు.. 1) కట్సూర కోగ (2015), 2) ప్రొ.కిమ్‌యాంగ్‌ షిక్‌ (2014), 3) డా. జిన్‌ దిన్‌ హాన్‌ (2014), 4) డా. అభిమన్యు ఉన్నుత్‌ (2013), 5) సర్‌ విఎస్‌ నైపాల్‌ (2010), 6) ప్రొ. ఆర్‌ఈ ఆషెర్‌ (2007), 7) డా.వాస్సిలిస్‌ విట్సాక్సిస్‌ (2002), 8) ప్రొ. ఇ.పి. చెలిషెవ్‌ (2002), 9) ప్రొ. ఎడ్వర్డ్‌ సి. డిమొక్‌ (1996), 10) ప్రొ. డేనియల్‌ హెచ్‌హెచ్‌ ఇంగాల్స్‌ (1996), 11) ప్రొ. కామిల్‌ వి.జ్వెలెబిల్‌ (1996), 12) ప్రొ.జి జియాంగ్‌ లిన్‌ (1996), 13) లియోపోల్డ్‌ సేదర్‌ సెన్‌ఘర్‌ (1974). 14వ వ్యక్తిగా ‘వేల్చేరు’ గుర్తింపు పొందారు. 

ఏలూరు టు అమెరికా..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన వేల్చేరు నారాయణరావు 1933లో శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో జన్మించారు.  ఏలూరులోని మేనమామ ఇంటి వద్ద ఉంటూ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాలలో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ చేసి, ఏలూరు సీఆర్‌ఆర్‌లోనే అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు