విశాఖలో అరుదైన శస్త్రచికిత్స

3 Sep, 2021 04:26 IST|Sakshi
రోగితో కలసి మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్‌ శివశంకర్‌ దలై

తీవ్ర తలనొప్పితో కోమాలోకి వెళ్లిన మహిళను బతికించిన వైద్యులు   

ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు కోమాలో ఉన్న మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమెను బతికించారు. డాక్టర్‌ శివశంకర్‌ దలై ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరం దరి సీతానగరానికి చెందిన సీహెచ్‌ సుబ్బలక్ష్మి (50) తీవ్ర తలనొప్పితో కోమాలోకి వెళ్లిపోయారు. ఆమెను కుటుంబ సభ్యులు విశాఖ మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్‌ శివశంకర్‌ దలై ఆమెకు పరీక్షలు నిర్వహించి.. దమనుల్లో వాపు వచ్చి రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు.

ఆమె అనిరుజం అనే వ్యాధికి గురైందని, దానివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఆమెకు వెంటనే ‘న్యూ ఫ్లో డైవర్షన్‌ ట్రీట్‌మెంట్‌’ పేరుతో ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి.. మెదడులో రక్తస్రావాన్ని నియంత్రించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె మెదడులో రక్త ప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి శస్త్రచికిత్సను మొదటిసారిగా మెడికవర్‌ ఆస్పత్రిలో నిర్వహించినట్టు తెలిపారు. ఆపరేషన్‌ జరిగిన 96 గంటల్లోనే రోగి కోలుకుందన్నారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి బంధువులు ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు