'సీమ' ఎత్తిపోతల టెండర్‌ 19న ఖరారు

18 Aug, 2020 04:42 IST|Sakshi

ఎస్పీఎంఎల్‌(జేవీ)కి పనులు అప్పగించేలా ఎస్‌ఎల్‌టీసీకి ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రూ.3,307.07 కోట్లకు సుభాష్‌ ప్రాజెక్ట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ లిమిటెడ్‌ (ఎస్పీఎంఎల్‌) జాయింట్‌ వెంచర్‌ (జేవీ) దక్కించుకుంది. ఈ పనుల టెండర్‌లో ‘ప్రైస్‌’ బిడ్‌ను సోమవారం కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెరిచారు. అంతర్గత అంచనా విలువ రూ.3,278.18 కోట్ల కంటే 1.9 శాతం అధిక ధరకు (రూ.3,340.47 కోట్లు) కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహించారు. రివర్స్‌ టెండరింగ్‌లో 0.88 శాతం అధిక ధర (రూ.3,307.07 కోట్లు)కు కోట్‌ చేసిన ఎస్పీఎంఎల్‌ (జేవీ) సంస్థ ఎల్‌–1 నిలిచింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి పంపుతామని, కమిటీ అనుమతి మేరకు ఈ నెల 19న టెండర్‌ ఖరారు చేసి వర్క్‌ ఆర్డర్‌ జారీ చేస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు.

కరువును రూపుమాపే లక్ష్యంతో..
► శ్రీశైలం జలాశయంలో వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కరువును రూపుమాపాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.
► శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి.. తెలుగు గంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు