2 నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు 

23 Sep, 2022 04:15 IST|Sakshi
కమలాపురంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేస్తున్న డీఐజీ శివరాం

రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ 

కమలాపురం : అక్టోబర్‌ రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని 1,949 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమవుతాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ బి.శివరాం తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం పట్టణంలోని సబ్‌ రెజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, దస్తావేజులను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేశామన్నారు. ఆయా సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్‌ అసిస్టెంట్‌లకు నెట్‌ వర్క్, స్కానింగ్, వెబ్‌క్యామ్‌లతో పాటు రిజిస్ట్రేషన్లు, సెటిల్‌ మెంట్లు, పార్టీషియన్లు ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో ఏ గ్రామానికి చెందిన వారు అదే గ్రామంలో రిజిస్ట్రేషన్‌ శాఖ సేవలను పొందవచ్చన్నారు.

ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్‌ జారీ, ఈసీల జారీ తదితర సేవలు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం సంబటూరు, జంభాపురం గ్రామ సచివాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ చెన్నకేశవరెడ్డి, సబ్‌ రెజిస్ట్రార్‌ డీఎం బాషా పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు