కృష్ణాలో మళ్లీ పెరిగిన వరద

13 Oct, 2020 04:03 IST|Sakshi

శ్రీశైలంలోకి 2,01,944 క్యూసెక్కుల ప్రవాహం

ఈ సీజన్‌లో ఏడో దఫా శ్రీశైలం గేట్లు ఎత్తివేత

2.03 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల

ధవళేశ్వరం వద్ద 1.63 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల  ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలతో పాటు, తుంగభద్ర డ్యామ్‌ నుంచి, హంద్రీ నది నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో సోమవారం రాత్రి 9.30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,01,944 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఏడు వేలు, హంద్రీ–నీవాకు 1,403 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న జలాలను ఆరు గేట్లు, కుడి గట్టు విద్యుత్కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీకి సోమవారం రాత్రి లక్ష క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. 

మరిన్ని వార్తలు