నెల్లూరు బ్యారేజీ పనులకు రూ.113 కోట్లు

7 Nov, 2020 04:01 IST|Sakshi

పాత కాంట్రాక్టు సంస్థతో ముందస్తుగా ఒప్పందం రద్దుకు ఓకే

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: నెల్లూరు బ్యారేజీలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ.113 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దివాలా తీసిన పాత కాంట్రాక్టర్‌తో పరస్పర సమ్మతితో కాంట్రాక్టు ఒప్పందాన్ని ముందస్తుగా రద్దు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో పెన్నాపై 1855లో బ్రిటిష్‌ సర్కార్‌ నిర్మించిన నెల్లూరు బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో 99,925 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.

ఆయకట్టుకు జీవం పోయడానికి, నెల్లూరు నగరం దాహార్తి తీర్చాలనే లక్ష్యంతో పాత బ్యారేజీకి 50 మీటర్ల దిగువన కొత్తగా బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో చేపట్టారు. ఇప్పటి వరకు ఈ బ్యారేజీ పనులకు రూ.127.64 కోట్లను ఖర్చు చేశారు. పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)లో దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.

బ్యారేజీ పనులను ఈ సీజన్‌లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. పనులు చేయలేని స్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థతో ముందస్తుగా ఒప్పందాన్ని రద్దు చేసుకుని.. కొత్త కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగిస్తే శరవేగంగా బ్యారేజీ పనులు పూర్తి చేయవచ్చునని తెలుగుగంగ సీఈ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.113 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. వీటిపై సర్కార్‌ ఆమోదముద్ర వేసింది.  

మరిన్ని వార్తలు