మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ.. 5 పెద్ద విమానాల టేకాఫ్‌ చేసేలా విస్తరణ

7 Jan, 2023 08:31 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

నిధులు, పనులకు ఆమోద ముద్ర 

టెర్మినల్‌ బిల్డింగ్‌ విస్తరిస్తే ఒకేసారి 1,400 మంది ప్రయాణికులు స్టే చేసే సామర్థ్యం 

5 పెద్ద విమానాల టేకాఫ్‌కు అవకాశం

సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసు­లకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రా­జ­మ­హేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు  విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్‌ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్‌ ఇంజినీరింగ్‌ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్‌­కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఇలా..
మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీ­టర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్‌ బేస్‌తో కూ­డిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్‌ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడు­స్తున్నా­యి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసు­లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.  

టెర్మినల్‌ భవన సామర్థ్యం పెంపు..  
విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.  భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్‌ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. 

భద్రతలోనూ మేటి
ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్‌ పోర్ట్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది.   యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు.

సంతోషంగా ఉంది.. 
టెర్మినల్‌ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్‌ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్‌ ఆర్డర్స్‌ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. 
–మార్గాని భరత్‌రామ్, ఎంపీ,

రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం..
టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి.   త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. 
– ఎస్‌.జ్ఞానేశ్వరరావు, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు