తెల్ల దోమలపై యుద్ధానికి బదనికల సైన్యం

17 Mar, 2021 20:09 IST|Sakshi
తెల్ల దోమ

ఉద్యాన పంటల రక్షణ కోసం శాస్త్రవేత్తల సృష్టి

ఫలించిన అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం ప్రయోగాలు

సోంపేట, వెంకట్రామన్న గూడెంలలో రూ.27 లక్షలతో  జీవ నియంత్రణా ల్యాబొరేటరీలు

సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన సర్పిలాకార తెల్లదోమ (రూగోస్‌ వైట్‌ ఫ్లై) ఉద్యాన పంటలు సాగుచేసే రైతులను వణికిస్తోంది. దేశంలోని కొబ్బరి తోటలతో పాటు 200 రకాలకు పైగా పంటలపై వేగంగా విస్తరిస్తూ సాగుదారులను నష్టాలకు గురి చేస్తోంది. ఈ కొత్త రకం తెల్లదోమ నియంత్రణ కోసం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలోని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. సర్పిలాకార తెల్లదోమలను సమర్థవంతంగా ఎదుర్కొనే మిత్ర పురుగులను తయారు చేయడమే కాకుండా.. వాటి ఉత్పత్తి కోసం రాష్ట్రంలో రెండుచోట్ల ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. 

కడియంలో కనబడి.. దేశమంతా విస్తరించింది 
సర్పిలాకార తెల్లదోమ విదేశీ మొక్కల ద్వారా దేశంలోకి చొరబడిన కొత్త రకం దోమ. 2016లో కడియం నర్సరీలలో దీనిని గుర్తించినప్పటికీ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. గడచిన రెండేళ్లుగా చాపకింద నీరులా దేశమంతటా ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉద్యాన పంటలను దెబ్బతీస్తోంది. మన రాష్ట్రంతోపాటు కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న కేరళ, గోవా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, బిహార్, అస్సోం వంటి రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. కొబ్బరితో పాటు అంతర పంటల్ని కూడా అతలాకుతలం చేస్తోంది. కొబ్బరిలో 25–30 శాతం, ఆయిల్‌పామ్‌లో 35 శాతం, అరటి ఇతర పంటల్లో 15 నుంచి 25 శాతం విస్తీర్ణంలో వ్యాప్తి చెందినట్టుగా గుర్తించారు. 


ఎలా దాడి చేస్తోందంటే.. 
సర్పిలాకార తెల్లదోమ రసం పీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఐదు దశల్లో వృద్ధి చెందే ఇది మామూలు తెల్లదోమ కన్నా ఐదు రెట్లు (దాదాపు 2.5 మి.మీ.) పెద్దది. దీని జీవితకాలం 40–45 రోజులు. ఇవి ఆకుల కింద భాగంలో చేరి రసాన్ని పీల్చేసి తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల ఏర్పడే లెప్టోగైజఫియమ్‌ అనే బూజు కిరణ జన్య సంయోగ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ దోమలు ఆకుల కింద తెల్లటి వలయాకారంలో గుడ్లను పెడతాయి. వీటి ఉధృతి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, ఆకులే కాదు రెమ్మ, మొదళ్లు, పువ్వులు, కాయలు సైతం తెల్లని దూది లాంటి పదార్థంతో నిండిపోతాయి. ఈ ప్రభావం వల్ల 20–30 శాతం మేర దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. 

నియంత్రణకు ఏం చేయాలంటే.. 
సర్పిలాకార తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించేందుకు ఆముదం పూసిన పసుపు రంగు అట్టలను కాండంపై ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి తక్కువగా ఉంటే మిత్రపురుగు డైకో క్రైసా ఆస్టర్‌కు చెందిన 100–150 గుడ్లు, ఎక్కువగా ఉంటే 300–500 గుడ్లు చొప్పున విడుదల చేయాలి. తగిన మిత్ర పురుగులు లేకపోతే ఒక శాతం వేపనూనెకు 10 గ్రాముల డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపి ఆకు అడుగు భాగాలు తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.  


ఫలించిన ‘ఉద్యాన’ పరిశోధనలు 
తెల్లదోమను ఎదుర్కొనేందుకు ‘సూడో మల్లడా’ అనే మిత్ర పురుగులు సమర్థవంతంగా పని చేస్తాయని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం  శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరు నుంచి ఇసారియా అనే ఫంగస్, తమిళనాడు, కేరళ, బెంగళూరు నుంచి ‘ఎన్‌కార్సియా’ అనే మరో మిత్ర పురుగును తీసుకొచ్చారు. వీటి తయారీలో ఆర్‌బీకే సిబ్బందికి, కోనసీమ ప్రాంత రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పైలట్‌ ప్రాజెక్టుగా కోనసీమలో తెల్లదోమపై ప్రయోగించి సత్ఫలితాలను సాధించారు. ఈ మిత్ర పురుగులు, ఫంగస్‌ తయారీ కోసం శ్రీకాకుళం జిల్లా సోంపేట, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో రూ.27 లక్షలతో జీవ నియంత్రణా పరిశోధనా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఐదు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు (ఎంవోయూలు) కూడా చేసుకున్నారు. 

జీవ నియంత్రణా పద్ధతులతోనే నివారణ సాధ్యం 
తెల్లదోమ సోకిన మొక్కలను ఒకచోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. జీవ నియంత్రణా పద్ధతుల ద్వారా సామూహికంగా దీన్ని నియంత్రించగలం. ఇప్పటికే 30 లక్షల మిత్ర పురుగులను తయారు చేశాం. పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌ అధికంగా ఉన్న దృష్ట్యా ఇవి ఏమాత్రం సరిపోవు. అందుకే వీటి తయారీ కోసం 5 కంపెనీలతో ఉద్యాన యూనివర్సిటీ ఒప్పందాలు చేసుకుంది.  
– డాక్టర్‌ ఎన్‌బీవీ చలపతిరావు, శాస్త్రవేత్త, కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట 

మరిన్ని వార్తలు