అమరావతిలో బినామీ ఫ్లాప్‌ షో

13 Oct, 2020 03:40 IST|Sakshi

అది కెమెరాల ఉద్యమం 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటే సీబీఐ విచారణ కోరాలి

ఆ మేరకు చంద్రబాబు ప్రధానికి లేఖ రాయాలి 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: అమరావతిలో జరుగుతున్నది చంద్రబాబు, ఆయన బినామీల కోసం చేస్తున్న ఒక కృత్రిమ ఉద్యమమని, అదొక బినామీ ఫ్లాప్‌ షో అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  పప్పు తినడం తప్పితే కందిపప్పు ఎలా వస్తుందో తెలియని లోకేష్‌.. తాను రైతునని మాట్లాడ్డం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..

► టీడీపీ నేతలు అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న కార్యక్రమం బాగా డబ్బున్న నిర్మాత తన కొడుకే హీరోగా ఒక చెత్త సినిమా తీసి తానే ఒక థియేటర్‌ అద్దెకు తీసుకుని ప్రపంచ రికార్డులు బద్దలు చేయాలనో, లేక గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాలనో వాళ్లకు వాళ్లే వంద రోజుల సెలబ్రేషన్స్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది.   
► ఉద్యమాలంటే తెలుగు సీరియల్స్‌లో ఉన్నట్లు కొత్త కండువాలు, కొత్త శాలువాలు వేసుకున్నట్లు ఉండవు. ఒక షో కోసం వచ్చినట్లు, ఆర్టిస్ట్‌లు చేసే విన్యాసాల మాదిరిగా ఉండవు. వీరిలో కొంత మంది అమాయకులు ఉండవచ్చు, వారిని మేం అవమానించడం లేదు. చంద్రబాబే ముందుండి ఎందుకు నాయకత్వం వహించడం లేదు?
► నిజాలు బయటకు వస్తుంటే.. చంద్రబాబు కుటుంబంలో కంగారు ఎక్కువైంది. ఈ స్కాంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను అడ్డం పెట్టుకొని బయట పడవచ్చు. పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులందర్నీ కలుపుకుని తప్పు చేస్తే.. అందరూ కలిసి బయటపడవచ్చు అన్నది చంద్రబాబు వ్యూహం. 

తప్పు చేయనప్పుడు భయమెందుకు?
► ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కోర్టుల్లో కేసులున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్న విషయం లోకేష్‌కు తెలియదా! ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటే డీజీపీ, సీఎస్‌కు లేఖ రాసే బదులు సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని మోదీకే లేఖ రాసి ఉండవచ్చు కదా? 
► ఏ తప్పూ చేయలేదు కాబట్టే, జగన్‌.. ఆయన ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా సిద్ధపడుతోంది. సోషల్‌ మీడియాలో జడ్జిల వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరుపడానికి అభ్యంతరం లేదని మా అడ్వకేట్‌ జనరల్‌ ధైర్యంగా ఒప్పుకున్నారు. మరి మీరెందుకు విచారణ అంటే వెనక్కి పోతున్నారు?
► ఈ రోజు 29 గ్రామాలు కాస్తా.. 3 గ్రామాలయ్యాయి. 3 గ్రామాలు కాస్తా.. 30 మందికి పరిమితమయ్యాయి. ఆ 30 మందీ రైతులా.. బాబు మద్దతుదారులా.. అన్నది అందరికీ తెలుసు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబు మాట విని రాష్ట్రంలో 0.001 శాతం కాదుగదా.. అందులో వెయ్యో వంతు కూడా ఆందోళన చేసింది లేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఏపీకి టూరిస్టుల కింద పిలిస్తే బాగుంటుంది. 
► రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నది అబద్ధం. అమరావతిలో చంద్రబాబు హయాంలో జరిగింది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. వాస్తవానికి జగన్‌ హయాంలోనే అమరావతికి న్యాయం జరగబోతోంది. అమరావతి ఉద్యమం నిజమైనదో కాదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు