వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు: సజ్జల రామకృష్ణారెడ్డి

19 Jan, 2023 08:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ డీఎన్‌ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అణగారిన వర్గాలు ఉన్నతస్థాయికి చేరుకుంటేనే నిజమైన సమ సమాజం ఏర్పడుతుందని విశ్వసిస్తూ గాంధీజీ, పూలే, అంబేడ్కర్‌ లాంటి మహానాయకులు కన్న కలలను సీఎం జగన్‌ సాకారం చేస్తున్నారని చెప్పారు. పరిపాలన అంటే ఎలా ఉండాలో చాటిచెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్సార్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సర డైరీ – క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమని ముఖ్యమంత్రి జగన్‌ దృఢంగా భావిస్తున్నారని, ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేమన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, అందరి సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు ఆయా వర్గాల ప్రజలకు వాటిని తెలియచేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. గతంలో ఉద్యోగుల సంఘాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలున్నా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సరైన మార్గంలోనే వెళుతోందన్నారు.

గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం 
గిరిజన సంక్షేమానికి సీఎం జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి, గిరిజ­న సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపా­రు. ఏజన్సీలో విద్య, వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం అమ­లు చేస్తున్న సంక్షేమ ప«థకాలు గిరిజనులకు చేరేలా ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని కోరారు. 

సామాజిక న్యాయం సాకారం.. 
సామాజిక న్యాయాన్ని ఆచరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై­నారిటీ వర్గాలకు చెందిన 50 శాతం ప్రజాప్రతినిధులను పాలనలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. 

తోడుగా నిలవాలి.. 
బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం చేకూరుస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై కూడా ఉందని శాసనమండలి సభ్యుడు డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.  తొలుత ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో  ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ  మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు(సోషల్‌ జస్టిస్‌) జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు, ఈఎన్‌సీ బాలూనాయక్, జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌  పద్మసుజాత, ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ  పాల్గొన్నారు.

బెంచ్‌ మార్క్‌గా సీఎం నిర్ణయం 
సీఎం జగన్‌ ప్రభుత్వంపై  విపక్షం అబద్ధాలను ప్రచారం చేస్తోందని సజ్జల ధ్వజమెత్తారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణంగా కించపరచిన వ్యక్తి చంద్రన్న కానుక, విదేశీ విద్యను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్య, వైద్యం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా వైఎస్సార్‌ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీకి మొదటి అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. నామినేటెడ్‌ పోస్టులు, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్‌ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతోపాటు మహిళలకు అందులో సగం కేటాయించారని చెప్పారు. సీఎం జగన్‌ తన నిర్ణయంతో బెంచ్‌ మార్కుగా నిర్దేశించారని తెలిపారు.

ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని భావిస్తే సంతకం చేయడానికి సీఎం జగన్‌ వెనుకాడరని వెల్లడించారు. అంతర్జాతీయ స్ధాయిలో పేద విద్యార్థులు రాణించాలనే ఇంగ్లిష్‌ను ప్రోత్సహిస్తున్నారని, తెలుగుపై కోపంతో కాదని స్పష్టం చేశారు. విదేశాల్లోని టాప్‌ వంద యూనివర్సిటీలలో పేద విద్యార్థులు సీటు తెచ్చుకుంటే ఎన్ని కోట్లైనా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. 101 నుంచి 200 ర్యాంక్‌ వరకు 50 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో అరకొరగానే విదిలించి బకాయిలు పెట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 9 సార్లు  దావోస్‌ వెళ్లిన చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు.  కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఒప్పందాన్నీ అమలు చేయలేదన్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు