Schools Reopen In Andhra Pradesh: తెరుచుకున్న బడులు

16 Aug, 2021 11:15 IST|Sakshi

పూర్తి జాగ్రత్తలతో తరగతుల నిర్వహణ.. భౌతికదూరం, మాస్కులు తప్పనిసరి

స్కూళ్ల పరిసరాల్లో శానిటైజేషన్‌.. 

తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతితోనే పాఠశాలకు హాజరు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు చేపట్టింది. పాఠశాలల వారీగా కోవిడ్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) అమలుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మార్గదర్శకాలు ఇవి.. 
ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతిస్తున్నారు. ఇక విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే తరగతులకు హాజరు కావాలి. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. పాఠశాల లోపల, బయట పరిసరాల్లోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ అమలు చేస్తారు. పాఠశాలలు గతంలో నిర్దేశించిన సమయాల ప్రకారమే పని చేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లల సంఖ్యకు తగినమేర వసతి లేని పక్షంలో తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. 

కోవిడ్‌ లక్షణాలున్న వారికోసం ఐసోలేషన్‌
విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్‌ స్కానింగ్‌ చేశారు. విద్యార్థులలో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలుంటే వారిని ఇళ్లకు తిరిగి పంపి వైద్య పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్‌ లక్షణాలున్న వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఇళ్లలో వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు స్కూలుకు రాకుండా ఇళ్ల వద్దనే ఉండేలా సూచించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

అనారోగ్యంతో ఉండే విద్యార్థులు కూడా స్కూళ్లకు రాకుండా హెచ్‌ఎంలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థులకు వైద్య పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలను సంప్రదించాలి. ఇద్దరు విద్యార్థులు, సిబ్బందిలో ఒకరికి ప్రతి వారం ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు చేయించాలి. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ ఉంటే కనుక మొత్తం తరగతిలోని విద్యార్థులందరికీ పరీక్షలు జరిపేలా విద్యాశాఖ అన్ని స్కూళ్లకు ఆదేశాలు పంపింది.

భౌతిక దూరం తప్పనిసరి
తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం అందించే సమయంలో అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు తరగతులకు వేర్వేరు సమయాల్లో అందించనున్నారు. స్కూలు వదిలిన సమయంలో అందరినీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధి ఇచ్చి తరగతుల వారీగా బయటకు పంపనున్నారు.

స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తప్పనిసరిగా స్నానం చేయడమో లేదా చేతులు కడుక్కొని మాత్రమే ఇళ్లలోకి ప్రవేశించాలని సూచిస్తున్నారు. స్కూలులో కూడా కోవిడ్‌ జాగ్రత్తలపై ఒక పీరియడ్‌లో అవగాహన కల్పిస్తారు. స్కూలు అసెంబ్లీ, బృంద చర్చలు, గేమ్స్, స్పోర్ట్సు వంటివి పూర్తిగా రద్దు చేశారు.   

మరిన్ని వార్తలు