కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!

26 Nov, 2022 18:54 IST|Sakshi

మద్దిపాడు: గొర్రెల కాపరికి తన జీవాలంటే ప్రాణం. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే కదా! తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం, చింతగుంట గ్రామానికి చెందిన కురమయ్య సుమారు వెయ్యి గొర్రెల మందకు కాపరి. 


అన్ని జీవాలకు మేత కావాలి కదా! అందుకే వాటిని మేపుకుంటూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి, గుండ్లాపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా మందకు రక్షణగా ఉంటారు. 


ఇంత పెద్ద సమూహంలో పిల్లలు పుట్టడం సహజమే. అయితే అవి నడవలేవు కాబట్టి వాటి కోసం బాడుగ వాహనం కావాలి. అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో కురమయ్యకు ఓ ఐడియా వచ్చింది. 


చిలకలూరిపేటలో ఓ ఆటోమొబైల్‌ గ్యారేజీకి వెళ్లి 38వేల రూపాయలు ఖర్చు చేసి ఇనుప గ్రిల్స్‌తో ట్రాలీ తయారు చేయించాడు. దానిని తన ద్విచక్రవాహనానికి అమర్చడంతో ట్రాలీ వాహనంలా మారిపోయింది. ప్రస్తుతం 60 మేక పిల్లలను ఎంత దూరమైనా సులువుగా తీసుకువెళుతున్నామని దీనివలన ఖర్చు తగ్గిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం)

మరిన్ని వార్తలు