వారి దోపిడీకి.. తెల్ల బోవాల్సిందే..!! 

31 Aug, 2021 21:41 IST|Sakshi

తెల్ల బోర్డుతో దర్జాగా దోపిడీ

ప్రభుత్వ ఆదాయానికి గండి

చోద్యం చూస్తున్న రవాణాశాఖాధికారులు

ముడుతున్న నెలవారీ మామూళ్లు? 

పట్నంబజారు (గుంటూరు తూర్పు): ఆంధ్ర ప్రదేశ్‌లోని జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్‌ వ్యాపారులు కొందరు యథేచ్చగా ట్రాన్స్‌పోర్ట్‌ దందా సాగిస్తున్నారు. వైట్‌బోర్డు మాటున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొండుతున్నారు. ఎల్లో బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. సొంత అవసరాల పేరుతో వాహనాలను కొనుగోలు చేసి అద్దె ట్యాక్సీలు తిప్పుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

చదవండి: దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు

అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని రోడ్డు, పర్మిట్‌ పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైట్‌బోర్డు పెట్టుకుని కమర్షియల్‌ వాహనాలు సంచరిస్తున్నాయి. ఎల్లో బోర్డు వాహనాల కంటే ఇవే అధికంగా తిరుగుతున్నాయి. పలువురు ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు వైట్‌బోర్డు ముసుగులో టాక్సీలు, క్యాబ్‌లను అద్దెకు తిప్పుతున్నారు. ప్రభుత్వాన్ని రూ. కోట్లలో పన్ను ఎగ్గొట్టేస్తున్నారు.

దందా ఇలా...! 
ట్రాన్స్‌పోర్టు వినియోగానికి కొనుగోలు చేసిన వాహనాలకు రవాణా శాఖ ఎల్లో బోర్డుతో (మాక్సీక్యాబ్‌) రిజిస్టేషన్‌ నంబరు జారీ చేస్తుంది. అదే సొంతంగా కొనుగోలు చేస్తే.. వైట్‌ నెంబర్‌ ప్లేటు కేటాయిస్తారు. ఇందులో ఎల్లో బోర్డు వాహనానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వైట్‌ బోర్డు వెహికల్‌ అయితే రిజిస్టేషన్‌ సమయంలో ఒకేసారి లైఫ్‌ట్యాక్స్‌ చెల్లిస్తే చాలు. ఈ నిబంధనను తమకు అనువుగా మలచుకున్న ట్రావెల్స్‌ వ్యాపారులు వైట్‌ బోర్డు కింద వాహనాలు తీసుకుని ట్యాక్సీలుగా అద్దెకు తిప్పుకుంటున్నారు. ప్రధానంగా 4–1 సీటింగ్‌ సామర్ధ్యంతో ఉన్న వైట్‌ బోర్డు వాహనాలు పెద్ద సంఖ్యలో ట్యాక్సీలుగా రాకపోకలు సాగిస్తున్నాయి.  జిల్లాలో 40 వేలకు పైగా వాహనాలు వైట్‌ నంబర్‌ ప్లేటుతో తిరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో  మొత్తం 2958 మాక్సీ క్యాబ్‌లు ఉన్నాయి.

ట్యాక్స్‌ ఎగవేతకే.. 
ప్రైవేటు ట్రావెల్స్‌ వారు త్రైమాసిక పన్నుతో పాటు రోడ్డు టాక్స్, చెక్‌పోస్టుల్లో పర్మిట్‌ చార్జీలను తప్పించుకునేందుకే తమ వాహనాలను వైట్‌బోర్డు ముసుగు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొండుతున్నారు. మామూలుగా టూరిస్టు బోర్డు (టీ–బోర్డు) ఎల్లో బోర్డు వాహనాలు ఏటా రవాణా శాఖ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) పొందాల్సి ఉంటుంది. అదే వైట్‌బోర్డు వాహనాలైతే రిజిస్టేషన్‌ అయిన తరువాత 15 ఏళ్ల వరకు ఎఫ్‌సీ అవసరం ఉండదు. ట్రావెల్స్‌ యజమానుల దందా కారణంగా ఏటా సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందనే తెలుస్తోంది.

మొక్కుబడిగా తనిఖీలు 
జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వైట్‌ బోర్డులు తగిలించుకున్న ట్యాక్సీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. కొంత మంది అధికారులు ఎల్లో నంబర్‌ ప్లేటును సైతం వైట్‌ ప్లేటుగా మార్చుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు.  ఇటీవల ఆర్డీవో, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇటువంటి వాస్తవాలు బయట పడ్డ కనీసం, అధికారుల్లో మాత్రం చలనం కరవైందనే చెప్పాలి. ఎల్లో ప్లేట్‌ మొదలు ఉదాహరణకు ఏపీ 39 తరువాత ‘టీ’తో మొదలయ్యే ప్రతి వాహనం ట్యాక్సీ ప్లేట్‌ అని స్పష్టం చేస్తోంది. అవి సైతం వైట్‌ ప్లేటుగా మార్చుకుని అధికారులే నేరుగా తిరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది.

ట్రావెల్స్‌తో మిలాఖత్‌ 
జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రావెల్స్‌కు సంబంధించి వైట్‌ ప్లేట్‌ (ఓన్‌ప్లేట్‌) వాహనాలు తిరుగుతున్నాయని తెలిసినప్పటికీ అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనికి సంబంధించి ఆయా డివిజన్‌ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్‌ యజమానులతో పాటు, పలు బస్సుల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనేది సమాచారం.

తనిఖీలు చేపడతాం 
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడతాం. పూర్తిస్థాయిలో ట్రావెల్స్‌పై దృష్టి సారించి, ప్రైవేట్‌ వాహనాలు ట్రావెలింగ్‌కు తిరగకుండా నిరోధిస్తాం. అయితే ప్రయాణికులు సైతం ఎల్లో ప్లేటు ఉన్న వాహనాలను మాత్రమే, ప్రయాణానికి వినియోగించాలని కోరుతున్నాం. దానివలన ప్రమాదవశాత్తూ.. ఏదైనా జరిగినా ఇన్సురెన్స్‌ వర్తిస్తుంది. వైట్‌ ప్లేటులో ఇన్సూరెన్స్‌ ప్రయాణికులకు వర్తించదు. అధికారులకు  ఎటువంటి అవినీతికి పాల్పడినా.. సహించం. కచ్చితంగా వారిపై చర్యలు        తీసుకుంటాం.  
– ఇవ్వల మీరాప్రసాద్, డీటీసీ, గుంటూరు

చదవండి: శీతాకాల అతిథులొచ్చేశాయ్‌!

>
మరిన్ని వార్తలు