మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ రేసులో సిక్కోలు మహిళ

17 Dec, 2021 14:01 IST|Sakshi
పైడి రజని 

శ్రీకాకుళం: మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ రేసులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మిసెస్, మిస్‌ విభాగాలకు జరుగుతున్న పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలున్నారు. సామాజిక సేవలు, కళలు, మహిళా సాధికారత, విద్యార్హతలాంటి అంశాలపై గత ఆరు నెలలుగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఓటింగ్‌ రేసు వరకు వచ్చేశారు.

మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌ రేసులో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పైడి రజని ఒక్కరే ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంగ్లిష్‌ విభాగం స్కాలర్‌ అయిన ఈమె విశాఖ ఏవీఎన్‌ కళాశాలలో కొన్నేళ్లుగా లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. జేసీఐ ఫెమీనా అధ్యక్షురాలిగా పలు అవార్డులు సాధించారు. సంప్రదాయ నాట్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్న ఈమె గత కొన్నేళ్లుగా శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ (సేవ) స్థాపించి క్యాన్సర్‌ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, అనాథాశ్రమంలో చిన్నారులు, మానసిక వికలాంగులు, వృద్ధాశ్రమంలో వృద్ధులు, నిరుపేదలకు పెద్ద ఎత్తున కొన్నేళ్లుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.

ఆన్‌లైన్‌ ఓటింగ్‌ రేసు వరకు రజని రావడం ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరే ఉండడంతో అన్ని వర్గాలకు చెందినవారు ఆన్‌లైన్‌లో పైడి రజనికి మద్దతు పలుకుతున్నారు. బుధవారం రాత్రి ఆన్‌లైన్‌ ఓటింగ్‌కు నిర్వాహకులు అనుమతి ఇవ్వగా గురువారం నుంచి ఓటింగ్‌ ప్రక్రియ ఊపందుకుంది. ఆన్‌లైన్‌లో సీ–15కు ఓటువేసి రజనికి మద్దతు పలకాలని శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ (సేవ) సభ్యులు, లయన్స్, జేసీస్, రోటరీ, వాకర్స్‌క్లబ్, మీడియా సంఘాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు సోషల్‌ మీడియాలో అభ్యరర్తిస్తున్నారు. మద్దతు పలకాలంటే mrsitap2021.com ను క్లిక్‌ చేసి ‘సి15’కు ఓటెయ్యొచ్చు.

మరిన్ని వార్తలు