శోభాయమానంగా వసంతోత్సవాలు 

15 Apr, 2022 04:57 IST|Sakshi
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు

రెండేళ్ల తరువాత భక్తులకు అవకాశం 

తిరుమల: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా మండపం కనువిందు చేస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల తరువాత భక్తులకు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం లభించింది.

వసంతోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి తోడ్కొని వచ్చారు. ఉదయం ఆస్థానం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. 

అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు.  సాయంత్రం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జీయర్‌ స్వాములు, ఏఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

నేడు స్వర్ణరథోత్సవం 
వసంతోత్సవాల్లో నేడు ఉదయం మలయప్పస్వామి స్వర్ణరథంపై మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు