ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్‌ను కొట్టేయండి

9 Oct, 2020 06:50 IST|Sakshi

నిరాధార కథనాల ఆధారంగా పిటిషనర్‌ పిల్‌ దాఖలు చేశారు

దానికి ఎలాంటి విచారణార్హత లేదు

తప్పుడు వార్త రాసిన ఆ పత్రికకు లీగల్‌ నోటీసు ఇచ్చాం

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన నిరాధార, తప్పుడు కథనాన్ని ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రాథమిక దశలోనే కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టును అభ్యర్థించింది. ఈ వార్తా కథనం ప్రామాణికతను తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్‌ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపింది. తప్పుడు కథనం ప్రచురించిన ఆ పత్రికకు ఇప్పటికే లీగల్‌ నోటీసు జారీ చేశామని, ఆ తదుపరి చర్యలు కూడా ఉంటాయని వివరించింది.

ప్రామాణికత లేని వార్తల ఆధారంగా పిల్‌ దాఖలు చేయడానికి కుదరదంది. ఇదే విషయాన్ని కుసుమలత వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందని పేర్కొంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపింది.

ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కరోనాతో బాధపడుతుండటంతో హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  (బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..)

>
మరిన్ని వార్తలు