జగన్‌ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

20 Dec, 2023 05:20 IST|Sakshi

మూడు వారాలు పొడిగించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టు విచారణను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మూడు వారాలు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్‌ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించాడు.

జగన్‌ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ దర్యాప్తు చేసి.. చార్జిషీట్‌ దాఖ­లు చేసింది. జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని చార్జిషీట్‌లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీని­వా­సరా­వు కోడికత్తి సంపాదించాడని, అదును చూసి జగ­న్‌పై దాడిచేశాడని వివ­రించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తరువాత ఎన్‌ఐఏ.. కుట్రకోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హ­త్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు.

ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్‌ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖ­లు చేశారు. ఈ పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్‌లో విచారించిన హై­కోర్టు.. విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణను నిలి­పేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చే­యాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. తాజాగా ఈ వ్యా­జ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. 

>
మరిన్ని వార్తలు