ఆ కోటిమంది వీళ్లే.. 

24 Dec, 2020 03:45 IST|Sakshi

వ్యాక్సిన్‌ తొలుత ఎవరికి వేయాలో నిర్ణయం 

3.7 లక్షల మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు 

జైళ్ల సిబ్బంది, హోం గార్డులు, దీర్ఘకాలిక వ్యాధి బాధితులు 

సుగర్, బీపీ, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యల పీడితులు 

50 ఏళ్లు దాటిన వారికి కూడా తొలిదశలోనే వ్యాక్సిన్‌ 

వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, టీకా వేయడానికి సర్వసన్నద్ధం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడానికి చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలిదశలో ఎవరికి వేయాలి, ఎంతమంది ఉన్నారు అనేది నిర్ణయించారు. జనవరిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉండటంతో తొలిదశలో టీకా వేయాల్సిన కోటిమందిని గుర్తించారు. వ్యాక్సిన్‌ వచ్చే పరిమాణాన్ని బట్టి టీకా వేస్తారు. అవసరమైన మేర వస్తే కోటిమందికి వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్‌ వేసేవారికి శిక్షణ, వ్యాక్సిన్‌ నిల్వ, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి విషయాలపై రోజువారీ సమీక్షలు జరుగుతున్నాయి. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వర్కర్లతో పాటు ఐసీడీఎస్‌ సిబ్బంది మొత్తం కలిపి 3.7 లక్షలమందికి టీకా వేస్తారు.

తరువాత పోలీసు విభాగంలో పనిచేసేవారు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్, హోంగార్డులు, జైళ్లలో పనిచేసే సిబ్బంది, జాతీయ విపత్తుల విభాగంలో పనిచేసే వలంటీర్లు, సివిల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేసేవారు, మున్సిపల్‌ వర్కర్లు కలిపి ఏడులక్షల మందికి వ్యాక్సిన్‌ వేస్తారు. 50 ఏళ్లు దాటిన వారు, 50 ఏళ్లు దాటి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు అందరూ కలిపి 90 లక్షలమంది వరకు ఉంటారు. వీరికీ టీకా వేస్తారు. రాష్ట్రంలో తొలి డోసు జనవరిలో రానున్నట్టు అంచనా వేస్తుండగా, వచ్చిన వ్యాక్సిన్‌ నిల్వ చేయడం ముఖ్యమైనది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,76,148 లీటర్ల వ్యాక్సిన్‌ను నిల్వచేసేందుకు కోల్డ్‌ చైన్‌ ఏర్పాట్లు చేశారు. 1,677 స్టోరేజీ పాయింట్లు, 4,065 కోల్డ్‌చైన్‌ ఎక్విప్‌మెంట్‌ సిద్ధం చేశారు.  

మరిన్ని వార్తలు