ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ కేసు సుమోటోగా విచారణ 

2 Dec, 2021 05:15 IST|Sakshi

సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో.. 

వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఎన్ని కేసులను ఉపసంహరించారు? 

పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి 

హోంశాఖ ముఖ్య క్యాదర్శికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: హైకోర్టుల అనుమతి లేకుండా ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రజా ప్రతినిధులపై కేసులు ఎత్తివేయరాదంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించడంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కేసుల ఉపసంహరణ నిమిత్తం దాఖలైన పిటిషన్ల వివరాలను అందజేయాలని విజయవాడలోని ప్రజా ప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను   23కి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించడం అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని, ఈ జీవోలను రద్దు చేయాలని హైకోర్టు సుమోటో పిటిషన్‌లో పేర్కొంది. కేసుల ఉపసంహరణ నిమిత్తం ఆయా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తూ జారీ చేసిన తొమ్మిది జీవోలను ఆ పిటిషన్‌లో ప్రస్తావించింది.

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నూజివీడు ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప అప్పారావు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నేతలు విరూపాక్షి జయచంద్రారెడ్డి, చెరుకూరి ద్వారకనాథ్‌రెడ్డిపై కేసుల ఉపసంహరణ వివరాలను ఆ పిటిషన్‌లో పొందుపరిచింది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది.  

మరిన్ని వార్తలు