తుపాను బాధితులకు అండగా ఉండాలి

15 Dec, 2023 05:16 IST|Sakshi

కేంద్రబృందాన్ని కోరిన ఎమ్మెల్యేలు 

భారీ నష్టం... తక్షణమే ఆదుకోవాలని బాధితుల మొర 

నష్టాన్ని వివరించిన అధికారులు 

సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్‌/రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సాంకేతిక నిపుణుల బృందం గురువారం పర్యటించింది. బాపట్ల, పశ్చిమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో  వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి  నమూనాలు సేకరించింది. శుక్రవారం మిగిలిన జి­లా­్లల్లో పర్యటన అనంతరం నమూనాలను విశ్లేషిం­చి కేంద్రానికి నివేదిక పంపనుంది. పౌరసఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ సాక్షితో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పరిశీలనలో వచ్చిన ఫలితాల ఆధారంగా  ధాన్యం సేకరణలో ప్రత్యేక సడలింపు­లు కోరతామన్నారు. తద్వారా ధాన్యం రైతులకు ఎటువంటి తగ్గింపులు లేకుండా సంపూర్ణ మద్దతు ధర అందిస్తామన్నారు.

ఆహార అవసరాలకు పనికిరాని ధాన్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తికి కోసం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. మిచాంగ్‌ తుపాను బాధితులకు అండగా ఉండాలంటూ గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, కిలివేటి సంజీవయ్య కేంద్రబృందాన్ని కోరారు. గురువారం తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది.  కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మీనా హోడాతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది.

రాష్ట్రం నుంచి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర రత్నూ, రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రాకే‹Ùకుమార్, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ పెంచల కిశోర్, ఆర్డీఓలు కిరణ్‌కుమార్, చంద్రముని తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయాన్ని ముంపు ప్రాంతాల్లో  పునరావాస కేంద్రాలు, భోజన వసతుల గురించి వివరించారు.  ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2500 ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరకులను అందించామని వివరించారు.

పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.  విద్యుత్, రోడ్లు, ఇరిగేషన్, మత్స్యశాఖ, పంచాయతీరాజ్‌లకు తీవ్రమైన నష్టం జరిగినట్లు తెలియజేశారు. స్థానిక రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన అన్ని అంశాలను కేంద్ర బృందం నమోదు చేసుకుంది. ఆ మేరకు కేంద్రానికి న­ష్టాల నివేదికను సమర్పించి అందరికి పూర్తిస్థా­యిలో సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపింది. 

ఉమ్మడి తూర్పు గోదావరిలో..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిచాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం, సంగాయగూడెం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు, అల్లిపూడి, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, రావికంపాడు, పీఈ చిన్నాయపాలెం, ఏవీ నగరం, గొల్లప్రోలు మండలం మల్లవరం, కొత్తపల్లి మండలం రమణక్కపేట, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామాల్లో  తుపానుకు దెబ్బ తిన్న వరి, అరటి తదితర ఉద్యాన పంటలు, ఇళ్లను బృందం అధికారులు పరిశీలించారు. రైతులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నష్టాల వివరాలు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో ధాన్యం నమూనాలు సేకరించారు. తుపాను నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. 

>
మరిన్ని వార్తలు