ఎవరా జడ్జి.. శిక్షణ సరిగా లేదా?.. సుప్రీంకోర్టు అసహనం

10 May, 2022 12:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు సరిగా అర్థం చేసుకోలేకపోయిన జడ్జి ఎవరు? జ్యుడీషియల్‌ అకాడమీ శిక్షణ సరిగా లేదా? అని నెల్లూరు అదనపు సెషన్‌ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెల్లూరు కేంద్ర కారాగారంలో గృహహింస, హత్య కేసులో దోషిగా తొమ్మిదేళ్లు శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తిని మూడు రోజుల్లో ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిలు మంజూరు చేయాలని సెప్టెంబర్‌ 28, 2020న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.
చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ 

3 రోజుల్లో జైలు అధికారులు హరికృష్ణను ప్రవేశపెట్టని కారణంగా ట్రయల్‌ కోర్టు బెయిలు నిరాకరించింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఏప్రిల్‌ 2022లో హరికృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో జైలు అధికారులు, ట్రయల్‌ కోర్టు జడ్జి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును సోమవారం జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో కోర్టు ఉత్తర్వులు తదనంతరం పరిణామాలను ధర్మాసనం ప్రస్తావించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయినా హరికృష్ణ కస్టడీలో కొనసాగారు. ఉత్తర్వులు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో పంపగా అక్టోబర్‌ 6న జైలు అధికారులకు అందాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెబుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్ని ట్రయల్‌ కోర్టు సరిగా అర్థం చేసుకున్నట్టు కనిపించడం లేదు. మూడు రోజుల్లో ప్రవేశపెట్టాలంటే త్వరగా ప్రవేశపెట్టాలని అంతేకానీ తర్వాత ప్రవేశపెడితే బెయిల్‌ ఇవ్వకూడదని అర్థం కాదు.

ఒక న్యాయాధికారి ఈ విధంగా అర్థం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారమంతా హైకోర్టుకు వదిలేస్తున్నామంది. 6 వారాల్లో హైకోర్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కింది కోర్టులు నెలవారీ నివేదికలను హైకోర్టుకు ఇస్తుంటే ఇలాంటివి జరగవని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. విచారణ సందర్భంగా ట్రయల్‌ కోర్టు జడ్జిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ జడ్జికి పదేళ్ల సర్వీసు పూర్తయిందా.. ఇలాంటి న్యాయాధికారులు ఉండటంపై క్షమించండి.. అంటూ వ్యాఖ్యానించింది.   

మరిన్ని వార్తలు