నిమ్మగడ్డకు సుప్రీం నోటీసులు

25 Jul, 2020 05:01 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

ఆగస్టు 4కి విచారణ వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్‌ఈసీగా తనను కొనసాగించాలన్న ఆదేశాలను అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో ప్రతివాది నిమ్మగడ్డకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. వారం రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే, జస్టిస్‌ ఏ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ అనుబంధ పిటిషన్‌ను విచారించింది.  

► రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్, న్యాయవాది మెహ్‌ఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ౖహైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని నివేదించారు. సదరు పిటిషన్‌ పరిష్కారమయ్యేంతవరకు కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని కోరారు.  

► నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ ధర్మాసనం ఆయా పిటిషన్లపై ఇదివరకే స్టే నిరాకరించిందన్నారు. దీనిపై జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే  స్పందిస్తూ ‘అవును.. మాకు గుర్తుంది (ఎస్‌.. వుయ్‌ ఆర్‌ కాన్షియస్‌..) అని పేర్కొన్నారు. అనంతరం హరీష్‌ సాల్వే తిరిగి వాదనలు వినిపిస్తూ నిమ్మగడ్డకు హైకోర్టు గవర్నర్‌కు విన్నవించుకునే స్వేచ్ఛనిచ్చిందని, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని గవర్నర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారని నివేదించారు.  

► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ తరఫున న్యాయవాది ఎం.విజయభాస్కర్‌ విచారణకు హాజరయ్యారు. తిరిగి ఆగస్టు 4న ఈ పిటిషన్‌ విచారణకు రానుంది.  

మరిన్ని వార్తలు