టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సాంకేతిక అడ్డంకులు

27 Feb, 2022 05:05 IST|Sakshi

ఇళ్లు నిర్మించిన స్థలం బదలాయింపులో ఆలస్యం  

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై పెరుగుతున్న పని ఒత్తిడి 

సమస్యలు అధిగమించి నెలాఖరు నాటికి 20 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్‌ లక్ష్యం

సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లను విశాఖ జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఫిబ్రవరి 11న రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాపురం నుంచి రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టినా ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇక్కడ 4,800(నూరు శాతం) ఇళ్లను అన్ని వసతులతో నిర్మించి అందుబాటులో ఉంచారు. అయితే ఇళ్లు నిర్మించిన స్థలాన్ని ప్రభుత్వం నుంచి మునిసిపాలిటీకి బదలాయించడం ఆలస్యమవడంతో ఇక్కడ ఐదు యూనిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయగలిగారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్న రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు ఫేజ్‌–1లో 2,528 ఇళ్లు పూర్తిచేశారు.

ఇక్కడ శనివారం నాటికి 401 యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని పెనుకులపాడు పెదగరువు వద్ద చేట్టిన 6,144 ఇళ్ల నిర్మాణంలో 70 శాతం యూనిట్లు పూర్తవగా.. 502 ఇళ్ల రిజిస్ట్రేషన్లను పూర్తిచేశారు. భీమవరం సమీపంలోని గునుపూడి మెంటేవారి తోటలో రెండు ఫేజుల్లో 8,352 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 75 శాతం దాకా నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై అధిక పని ఒత్తిడి కారణంగా 10 యూనిట్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే పూర్తయింది.

దీంతో పాటు విజయనగరం జిల్లాలోనూ ఇదే తరహా ఒత్తిడి కారణంగా 21 యూనిట్లకు, శ్రీకాకుళం జిల్లాలో 22 యూనిట్లకు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. కాగా, మొత్తం నాలుగు జిల్లాల్లో ఐదు చోట్ల ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు శనివారానికి 961 యూనిట్లను లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందించారు. ప్రస్తుతం ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను సరిచేసి ఇతర జిల్లాల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని మార్చి నెలాఖరుకు 20 వేల యూనిట్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేసి అందించే లక్ష్యంతో అధికారులున్నారు.     

మరిన్ని వార్తలు