గోదావరి చెంతన తెలుగు పరవళ్లు

6 Jan, 2024 04:50 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలనం చేసి సభలను ప్రారంభిస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

రాజమహేంద్రవరంలో 3 రోజులపాటు తెలుగు మహాసభలు   

ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌  

తరలివచ్చిన కవులు, కళాకారులు

సాక్షి,రాజమహేంద్రవరం/రాజానగరం:: గోదావరి చెంతన.. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇక్కడి గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి.

రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా, ఆదికవి నన్నయ భారతాన్ని ఆంధ్రీకరించి వెయ్యేళ్లయిన సందర్భంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ భట్టారక, నారాయణభట్టు వేదికలపై నిర్వహిస్తున్న ఉత్సవాలను గవర్నర్‌ విశ్వభూషణ్, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు.  గవర్నర్‌ మాట్లాడుతూ.. సంస్కృతి, రచనలకు కేరాఫ్‌ అడ్రస్‌గా రాజ­మహేంద్రవరం విరాజిల్లుతోందన్నారు.  

స్వ­రూ­పానం­దేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కావ్యాలు, పురాణేతిహాసాలను తెలుగు వాళ్లు అనువదించినట్టు ఎవరూ చేయలేదన్నారు. పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనల్లోని పదాలు చూస్తే ముచ్చటేస్తుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్య­కారి వారణాసి రామ్‌మాధవ్, మహామహోపాధ్యా­­య విశ్వనాథ గోపాలకృష్ణ, ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, యా­నాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందెశ్రీ, జేఎన్‌టీయూకే వీసీ ప్రసాదరాజు, ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. 

పూర్ణకుంభ పురస్కారాలు 
తెలుగు జాతికి పూర్వీకులు అందించిన సేవలను గుర్తించి, వారి వారసులను సత్కరించడం అభినందనీయమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్, శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు.  తెలుగు మహాసభల్లో రాజరాజనరేంద్రుని వేదికపై శుక్రవారం సాయంత్రం జరిగిన పూర్ణకుంభ అవార్డుల ప్రదానోత్సవంలో వారు మాట్లాడారు.

 తెలుగు జాతికి విశిష్ట సేవలందించిన ప్రముఖులు తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల, తిక్కన సోమయాజి, డొక్కా సీతమ్మ, పరవస్తు చిన్నయసూరి, గుర్రం జాషువా, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, పెద్దింటి దీక్షిత్‌దాసు, ఘంటసాల వెంకటేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు, సాలూరి రాజేశ్వరరావు, పీబీ శ్రీనివాస్, జంధ్యాల, జమునా రాయలు, బాపు తదితరుల వారసులను అతిథులు సత్కరించారు.   విశ్వనాథ గోపాలకృష్ణ, బుచ్చి­వెంకటపాతిరాజు, జిత్‌మోహన్‌మిత్రా, ఎర్రాప్ర­గడ రామ­కృష్ణ, కూచిభోట్ల ఆనంద్, రసరాజు, బాదం బాలకృష్ణ, వంశీ రామరాజు, చెరుకువాడ రంగసాయి, తనికెళ్ల భరణి, గౌతమీ గ్రంథాలయం, నన్న­య భట్టారక పీఠం, చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ప్రతినిధులు కూడా పురస్కారాలు అందుకున్నారు.

>
మరిన్ని వార్తలు