Sakshi News home page

నారా దారి.. అడ్డదారి: పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు

Published Sat, Jan 6 2024 4:52 AM

Tdp Conspiracies and new ways to face Jagan at the time of election - Sakshi

నిజం చెప్పడు... నేరుగా పోరాడడు.. అవకా­శ­వాదమే కాదు అలవోకగా అబద్ధాలా­డేసే నైజం. ఇచ్చిన మాటంటే లెక్కే ఉండదు. ఏరు దాటాక తెప్పని బూడిద చేసి నీట్లో కలిపేసే రకం. అధికారం కోసం దేనికైనా రెడీ. శత్రు­వుల కాళ్లు పట్టుకోవటానికైనా... మిత్రుల కాళ్లు నరికేయడానికైనా...!! ఎంతసేపూ... తనకు ఎవరు, ఎలా ఉపయోగప­డతా­రనే యావే. బహుశా! ఆధునిక రాజకీ­యాల్లో చంద్రబాబు లాంటి నాయకుడెవరినీ చూడలేం. పురాణాల్లోనూ ఇలాంటి పాత్ర కనిపించదు.

ఎందుకంటే వాటిలోని పాత్రల లక్షణం ఒక్కటీ ఈయనలో ఉండదు. ఈయనకున్న అవ లక్షణాలు పురాణాల్లోని ఏ ప్రతినాయకుడికీ ఉండవు. కానీ చంద్ర­బాబులోని ఈ అవలక్షణాలన్నిటికీ విజన్‌.. చాణక్యం.. అనే ముసుగులేసి ఆయనో ఘనమైన నాయకుడని నమ్మించింది ఓ వర్గం మీడియా. వీళ్ల దృష్టిలో బాబు ఏం చేసినా... అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా... ప్రజాస్వామ్యం కోసమే!!. ఔరా.. ఇంత దౌర్భాగ్యమా??

నిలువెల్లా దుర్మార్గాన్ని, విషాన్ని నింపేసుకున్న 63 కిలోల.. 73 ఏళ్ల చంద్రబాబు సీఎం వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోవటానికి కుతంత్రాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రజాబలం లేక ఓటమి తరుముకొస్తుండటంతో వాటిని పతాక స్థాయికి చేరుస్తున్నారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సీఎం జగన్‌ను తను, తన పార్టీ ఏమీ చేయలేమని తెలుసు గనక జనసేన, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలన్నిటినీ కూడగడుతున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ కూడా... తనకు అనుకూలంగానే పనిచేసేలా వాటిలోని తన మనుషుల ద్వారా ఆపరేట్‌ చేస్తున్నారు.

2019లో చంద్రబాబు ఓడిపోగానే ఆయన ఆదేశాల మేరకు బీజేపీలోకి ఫిరాయించిన సి.ఎం.రమేశ్, సుజనా చౌదరి ఇప్పటిదాకా బాబు–బీజేపీలను కలపటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సి.ఎం.రమేశ్‌ ఓవైపు  ఆ పని చేస్తూనే మరోవైపు బీటెక్‌ రవిని రంగంలోకి దించడంతోపాటు  వైఎస్‌ షర్మిలకు ప్రత్యేక విమానాలు సమకూర్చి సేవలందిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావటంతో  టీడీపీ–కాంగ్రెస్‌ సంబంధాలు మరింత బలపడ్డాయి. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ ద్వారా వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించిన నాటి నుంచి హస్తంతో  చంద్రబాబు అక్రమ బంధం కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు కాంగ్రెస్‌ వ్యూహకర్తగా తన సామాజిక వర్గానికే చెందిన సునీల్‌ను నియమించి తెరచాటున పనులు చక్కబెడుతున్నారు. ఏపీ కాంగ్రెస్‌ ఏ దిశగా వెళ్లినా అది తనకే మేలు చేసేలా బాబు ఏర్పాట్లయితే చేసుకున్నారు. కానీ 90ల నాటి కాలం చెల్లిన ఈ పాచిపోయిన ఐడియాలు ఇప్పుడు పనికొస్తాయా? హఠాన్మరణం తర్వాత కూడా దివంగత వైఎస్సార్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్‌ పార్టీకి, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి ఏపీలో ఎవరు నేతృత్వం వహించినా ప్రజలు మద్దతు ఇవ్వబోరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఎవరెవరిని ఎలా వాడుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం...

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటం, గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం గోచరిస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంపై దింపుడు కళ్లం ఆశలతో అరాచకత్వానికి పాల్పడుతున్నారు. గత ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో విడిగా పోటీ చేయించిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తూ జనసేనతో జత కలిశారు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆపార్టీకి ఇం‘ధనం’ సమకూర్చిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడ టీడీపీ నేతలందరినీ ‘హస్త’గతం చేశారు.

రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తనకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారిని బీజేపీలోకి పంపి అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రమేష్‌ ద్వారా ప్రత్యేక విమానాలను సమకూరుస్తూ కుట్రలకు పదును పెట్టారు. తన శిష్యుడైన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి నోట్ల కట్టలు వెదజల్లి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టేలా చేసిన చంద్రబాబు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాక మరోసారి ఇం‘ధనం’ సమకూర్చి సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకరించారు. కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్‌ కనుగోలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చంద్రబాబు చెప్పినట్లు ఆడేందుకు, వ్యూహాల పేరిట బాబు ప్లాన్‌ను అమలు చేసేందుకు ఆయన సదా సిద్ధంగా ఉంటారు. 

పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు..
సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ రోజుకు రోజుకు పెరుగుతోందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో ఆపార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని టైమ్స్‌ నౌ లాంటి జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు పూర్తిగా కోల్పోవడంతో టీడీపీ ఉనికి కూడా చాటుకోలేదని ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. గత ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని పసిగట్టిన చంద్రబాబు అడ్డదారి పట్టారు. అనాదిగా మైనార్టీలు కాంగ్రెస్‌ వెనుకే ఉంటారన్న ఓ పాచిపోయిన భావనను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది ఆయన ఎత్తుగడ.

వైఎస్సార్‌సీపీలో టిక్కెట్‌ దక్కని వారికి తన శక్తుల ద్వారా కాంగ్రెస్‌ టికెట్లు ఇప్పించి ఇం‘ధనం’ సమకూర్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది బాబు ప్లాన్‌. ఒకవైపు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను చీల్చడం.. మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓటు వైఎస్సార్‌సీపీకి దక్కకుండా చేయడం దీని వెనుకున్న మరో ఎత్తుగడ. ఇలా ఓవైపు కాంగ్రెస్‌ను తానే నడుపుతూ స్వార్థానికి వాడుకోవడమే కాకుండా.. ఇంకోవైపు బీజేపీని కూడా తన వైపు తిప్పుకుని అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న తన మనుషులు, తాను సృష్టించిన పాత్రల ద్వారా ఈ ఎత్తుగడలను అమలు చేసే ప్రణాళిక వేశారు.

శిథిలమైన కాంగ్రెస్‌తో శూన్యమే..
2014లో ఇటు రాష్టంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించింది. విభజనతో పూడ్చలేని నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మిగిల్చింది. తరతరాలపాటు రాష్ట్ర ప్రజానీకాన్ని కోలుకోనివ్వకుండా దెబ్బ తీసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి కనీసం విభజన చట్టంలో కూడా చేర్చకుండా మోసం చేసింది. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకునే అవకాశాన్ని కల్పించింది.

ఏపీకి తీరని అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 1.17 శాతం ఓట్లు లభించగా నోటాకు 1.28 శాతం ఓట్లు రావడమే అందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇదీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శిథిలమైన కాంగ్రెస్‌ నుంచి చంద్రబాబు ఆశించే ప్రయోజనం ఒనగూరే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు.

హఠాన్మరణం తర్వాత కూడా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పార్టీకి ఏపీలో ఎవరు నేతృత్వం వహించినా ప్రజలు మద్దతు ఇవ్వరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జనం మెచ్చిన సీఎం జగన్‌ సామాజిక న్యాయ పాలన ప్రభంజనంలో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు కొట్టుకుపోవడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement