సీతాకోక చిలుకల హరివిల్లు 

7 Jan, 2023 11:01 IST|Sakshi

పాపికొండల్లో అరుదైన జాతులు 

అభయారణ్యంలో 130 వరకు రకాలు 

సందర్శకులను ఆకట్టుకునే అందాలు

ప్రకృతి ప్రేమికుల మది దోచుకుంటున్న వైనం   

బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): ఎన్నెన్నో అందాలు.. అన్నింటా అందాలు.., సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అని కవులు సీతాకోక చిలుక అందాలను అభివర్ణించారు. సప్తవర్ణ శోభితమైన వాటి సోయగాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటున్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండల అభయారణ్యం జీవవైవిధ్యంతో అలరారుతోంది. అరుదైన రకాల సీతాకోక చిలుకలకు ఆలవాలంగా నిలుస్తోంది. 

జాతీయస్థాయి విజేత ఓకలీఫ్‌ 
పాపికొండల అభయారణ్యంలో జంతువులు, వృక్షాలే కాక అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండల నేషనల్‌ పార్క్‌లో ఉన్న 3 రకాల సీతాకోక చిలుకలు పోటీపడ్డాయి. తుది పోరులో దేశవ్యాప్తంగా 7 రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా వీటిలో పాపికొండల అభయారణ్యంకు చెందిన 3 రకాల ఉన్నాయి. వీటిలో ఆరెంజ్‌ ఓకలీఫ్‌ జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఇవి వర్షాకాలం, శీతాకాలం సమయంలో గుంపులుగా తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటాయి. పచ్చని చెట్ల మధ్య సీతాకోక చిలుకలు ఎగురుతుండటం ఆహ్లాదంగా అనిపిస్తుంది. అరుదైన సీతాకోక చిలుకలు పాపికొండల అభయారణ్యంలో కనిపిస్తున్నాయి.  

1,045 రకాల జంతువులు 
పాపికొండల అభయారణ్యం ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా 2008 నవంబర్‌ 4న ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్క్‌గా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడి జంతుజాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారు. పెద్ద పులులు, చిరుతలు, అలుగులు, గిరినాగులతో పాటు పలురకాల జంతువులకు నిలయంగా  అభయారణ్యం మారింది.  

అరుదైన జీవజాలం 
అరుదైన జీవజాలానికి నిలయంగా పాపికొండల అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే వృక్ష సంపద ఉంది. వీటితోపాటు పలురకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. 2021లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కామన్‌ జెజెబెల్, కామన్‌ నవాబ్, ఆరెంజ్‌ ఓకలీఫ్‌ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఆరెంజ్‌ ఓకలీఫ్‌ అనే సీతాకోక చిలుక జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఈ అభయారణ్యంలో 130 రకాల రంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి.  
– జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్‌ డిప్యూటీ రేంజర్, పోలవరం 
 

మరిన్ని వార్తలు