ఏపీలో తెలంగాణ మద్యానికి 'చెక్'‌..!

31 Oct, 2020 02:59 IST|Sakshi

తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

రెండు రాష్ట్రాల వినియోగంలోనూ భారీ వ్యత్యాసం

కర్ణాటక, తమిళనాడు నుంచీ పెరుగుతున్న స్మగ్లింగ్‌

మూడు బాటిళ్ల రవాణాపై నిషేధం..

ధరల సవరణతో ఇతర రాష్ట్రాల మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట

సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. అంతకు ముందు మూడు బాటిళ్ల రవాణాపైనా నిషేధం విధించి నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ బాటిళ్లకు అనుమతి లేకుండా చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా స్మగ్లింగ్‌ జరిగింది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. మరోవైపు పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలూ పెద్దఎత్తున పెరగడం గమనార్హం. ఇందుకు కారణం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం స్మగ్లింగ్‌ జరగడమే. మద్యం ధరలు ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉండటంతో అక్కడ్నుంచి స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో పోలిస్తే రూ.426 కోట్లు పెరిగిన అమ్మకాలు
► గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు తెలంగాణలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో రూ.426 కోట్లు పెరిగాయి.
► అదే మద్యం వినియోగాన్ని ఏపీతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనపడుతోంది. తెలంగాణలో ఈ ఐదు నెలల వ్యవధిలో మద్యం వినియోగం 142.72 లక్షల కేసులు కాగా, ఏపీలో 49 లక్షల కేసులు మాత్రమే. 
► తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్‌–ఆగస్ట్‌)తో ఈ ఏడాది పోల్చి చూస్తే ఆదాయంలో 2.93%, అమ్మకాల విలువలో 4.66% వృద్ధి నమోదైంది. ఏపీలో భారీగా 65% వినియోగం తగ్గింది. 
► మద్యం కేసుల వినియోగం కర్ణాటకలో 198.88 లక్షలు కాగా, తమిళనాడులో 172.64 లక్షల కేసులు.
► ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచే 630 కేసులు కాగా, కర్ణాటక– 546, ఒడిశా– 24, తమిళనాడు– 11 కేసులు నమోదయ్యాయి.

ఐదు నెలల్లో రూ.2,170 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ
గతేడాది ఏప్రిల్‌–ఆగస్ట్‌ కాలంలో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.7,638.24 కోట్లు కాగా,  ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయం కోల్పోయింది. అంటే 28.411% ఆదాయం తగ్గింది.

2 మద్యం, బీరు అమ్మకాల విలువను పరిశీలిస్తే ఈ ఐదు నెలల వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. 

>
మరిన్ని వార్తలు