130 కిలోమీటర్ల వేగం.. నిద్రమత్తు... ముగ్గురు మృతి

12 Nov, 2022 07:40 IST|Sakshi

సాక్షి, చిత్తూరు, తవణంపల్లి: బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిపై తవణంపల్లె మండలం నర్తపుచేను చెరువు వద్ద శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో భార్యాభర్తలతోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. వివరాలు.. బాపట్ల జిల్లా నాగులుప్పులపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన అశోక్‌బాబు(33), భార్య  మౌనిక (29), కుమారుడు ప్రభవ్‌ (3) కారులో బెంగళూరు నుంచి గుంటూరులోని అత్తగారింటికి బయలుదేరారు. నర్తపుచేను దగ్గరకు వచ్చేసరికి కారు అదుపుతప్పి పక్కన సరీ్వసు రోడ్డులో ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదతీవ్రతకు డ్రైవింగ్‌ చేస్తున్న అశోక్‌ తల, మొండెం వేరయ్యాయి. పక్కసీట్లో ఉన్న భార్య, కుమారుడి తలలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి.
 
ఘటనాస్థలం.. రక్తసిక్తం 
ప్రమాదస్థలం బీతావహంగా తయారైంది. ఛిద్రమైన శరీరాలతో రక్తసిక్తంగా మారింది. కారు పైభాగం ట్యాంకర్‌ కిందకు వెళ్లిపోవడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. డ్రైవింగ్‌ చేస్తున్న అశోక్‌ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తూ ట్యాంకర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. కారులో రెండు సెల్‌ఫోన్లు దొరికినా, అవి లాక్‌ అయి ఉన్నాయి. దీంతో ఆ ఫోన్‌లకు కాల్‌ వచ్చేవరకు పోలీసులు వేచి ఉండాల్సి వచ్చింది.  

ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎస్పీ 
ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసరెడ్డి వివరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. 

బంధువుల ఇంటికొస్తూ..
నాగులుప్పలపాడు :  చిత్తూరు జిల్లా తవణంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అశోక్‌ బాబు స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 20 ఏళ్ల కిందట అశోక్‌బాబు తల్లిదండ్రులు అద్దంకి ఆంజనేయులు, వెంకాయమ్మ  కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చి వెళుతుంటారు. అశోక్‌బాబు పదో తరగతి వరకు నాయనమ్మ వద్ద ఉంటూ ఉప్పుగుండూరు పాఠశాలలో చదువుకున్నాడు. ఉన్నత చదువుల తర్వాత బెంగళూరులో ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మౌనికతో ఐదేళ్ల కిందట వివాహమైంది. గుంటూరులో అత్తగారింటికి వస్తున్న అశోక్‌బాబు కుటుంబం ప్రమాదంలో మృత్యువాత పడటంతో బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

మరిన్ని వార్తలు