పాపికొండల్లో పెద్ద పులులు

31 Mar, 2022 05:07 IST|Sakshi
ట్రాప్‌ కెమెరాకు చిక్కిన పెద్ద పులి

తొలిసారి ట్రాప్‌ కెమెరాకు చిక్కిన పులి జాడలు

చిరుతలు, 30 అడుగుల గిరినాగుల సంచారం 

230 రకాల పక్షులు, 19 రకాల ఉభయచరాల గుర్తింపు 

సర్వే వివరాలు వెల్లడించిన వైల్డ్‌లైఫ్‌ అధికారులు

బుట్టాయగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులి జాడలు కనిపించాయి. చిరుతల సందడిని గుర్తించారు. సుమారు 90 రోజులపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో వైల్డ్‌లైఫ్‌ అధికారులు పులుల గణన నిర్వహించారు. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయనే సమాచారాన్ని రాబట్టారు. ఈ అభయారణ్యం పరిధిలో పెద్దపులి జాడలు కనిపించడం ఈసారి సాధించిన విజయం. ఈ సారి గణనలో అత్యంత విషపూరితమైన 30 అడుగుల గిరినాగు కూడా కంటపడింది. ఈ అభయారణ్యంలో కొండగొర్రెలు, పాంథర్, కొండచిలువలు, దుప్పులు, సాంబాలు, నక్కలు, ముళ్ల పందులు, ముంగిసలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవికుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవిపందులు తిరుగుతున్నట్లు గుర్తించారు.  

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1012.858 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి అటవీప్రాంతంలోని జంతు సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే రెండుసార్లు పాపికొండల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని వైల్డ్‌లైఫ్‌ అధికారులు నిర్వహించారు. మొదట్లో నిర్వహించిన సర్వేలో పులులు ఉన్నప్పటికీ కెమెరాకు చిక్కలేదు. ఈ సారి నిర్వహించిన సర్వేలో పులులు ట్రాప్‌ కెమెరాకు చిక్కాయి.  

రెండు దశల్లో సర్వే 
పాపికొండల అభయారణ్యంలో పులుల గణనకు సంబంధించిన సర్వేను వైల్డ్‌లైఫ్‌ అధికారులు రెండు దశల్లో నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 232 పైగా ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల్ని గుర్తించారు. మొదటి దశలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న అటవీప్రాంతంలోని 71 చోట్ల 142 కెమెరాలను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 45 ప్రాంతాల్లో 90 కెమెరాలు ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు.  

ట్రాప్‌ కెమెరాలో పులుల జాడ 
2018లో నిర్వహించిన పులుల గణన సర్వేలో ఈ ప్రాంతంలో పులులు ఉన్నా ట్రాప్‌ కెమెరాకు చిక్కలేదు. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పులుల జాడ స్పష్టంగా కెమెరాకు చిక్కాయి. పూర్తి స్థాయిలో పులుల గణన వివరాలు జులై 29న వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో జరిగిన గణన వివరాల నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగం(ఎన్‌టీసీఏ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ వివరాలను ప్రపంచ పులుల దినోత్సవం రోజైన జులై 29న పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్‌ అధికారులు చెబుతున్నారు.

230 పక్షుల రకాల్ని గుర్తించాం 
పాపికొండల అభయారణ్యంలో పులుల గణన పూర్తయ్యింది. సుమారు 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో పులులు, చిరుతలతో పాటు 230 రకాల పక్షులు, 14 రకాల జాతుల ఉభయచర జీవులు ఉన్నట్లు ట్రాప్‌ కెమెరాలు గుర్తించాయి. ఇక్కడ నిర్వహించిన సర్వే నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగానికి పంపిస్తాం.  
– సి.సెల్వమ్, డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ 

116 ప్రాంతాల్లో సర్వే 
పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సర్వేలో ఏనుగు, సింహం తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించాం. జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.  
– ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్, వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ అధికారి. పాపికొండలు 

మరిన్ని వార్తలు