డ్రైవింగ్‌ టెస్ట్‌.. ఇకపై అక్రమాలకు చెక్‌ పెట్టనున్న ప్రభుత్వం

2 Jun, 2022 21:01 IST|Sakshi

డ్రైవింగ్‌ సామర్థ్య పరీక్షలు ఆటోమేటెడ్‌గా జరగనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనదారుల పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో పనులు పూర్తిచేశారు. అక్రమాలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్త ట్రాక్‌లను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సాక్షి,చిత్తూరు రూరల్‌: చిత్తూరు ప్రశాంత్‌ నగర్‌ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇక్కడ డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం రోజుకు వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ కార్యాలయంలో గతంలో అక్రమంగా లైసెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉండేది. అయితే వీటికి చెక్‌ పెట్టాలని ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరు నెలల క్రితం ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించారు. ఇందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితమే పనులు పూర్తి చేసి ట్రయల్‌ నిర్వహిస్తున్నారు.    

ట్రాక్‌ నిర్మాణం ఇలా  
మొత్తం ఇక్కడ 13 ట్రాక్‌లు ఉన్నాయి. ఎంవీ(మోటార్‌ వెహికల్‌)కు సంబంధించి 5 ట్రాక్‌లు ఉండగా, అందులో 8 ట్రాక్, హెయిర్‌పిన్‌ ట్రాక్, బ్యాలన్స్‌ బ్రిడ్జి ట్రాక్, రఫ్‌ రోడ్డు ట్రాక్, గ్రేడియంట్‌ వంటి ట్రాక్‌లు ఉన్నాయి. ఎల్‌ఎంవీ(లైట్‌ మోటార్‌ వెహికల్‌)లో కూడా 5 ట్రాక్‌లు ఉంటాయి. 8 ట్రాక్, పార్కింగ్, హెచ్‌ ట్రాక్, టీ ట్రాక్, గ్రేడియంట్‌లు ఉంటాయి. హెచ్‌ఎంవీ (హెవీ మోటార్‌ వెహికల్‌)లో మూడు ట్రాక్‌లు మాత్రమే ఉండగా, హెచ్‌ ట్రాక్, గ్రేడియంట్, పార్కింగ్‌లు ఉన్నాయి. వీటిని కొత్త విధానంలో అమలులో భాగంగా రీ మోడలింగ్‌ చేశారు. ఈ ట్రాక్‌ల చుట్టూ 27 సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి ట్రాక్‌లోను బొలెట్స్‌ (సెన్సర్‌ను అమర్చిన పోల్స్‌) అమర్చారు. దీంతో పాటు ఆర్‌ఎఫ్‌ రీడర్స్‌ 26 దాకా ఏర్పాటు చేశారు. డిస్‌ప్లే బోర్డులు –13, సిగ్నల్‌ స్తంభాలు 13, కంప్యూటర్‌ పరికరాలు 15, మానిటర్‌ 2, ఒక కియోస్క్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం సర్వర్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఇన్‌స్పెక్టర్, నెట్‌ వర్కింగ్‌ ఇంజనీర్‌ పర్యవేక్షిస్తుంటారు. డ్రైవింగ్‌ ట్రయల్‌కు వెళ్లిన వ్యక్తిని ఈ కంట్రోల్‌ రూమ్‌ నుంచే చూస్తుంటారు. ఈ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.   

డ్రైవింగ్‌ శిక్షణకు ఎలా వెళ్లాలంటే.. 
ఆటోమెటిక్‌ పద్ధతి ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ పొందిన వ్యక్తులు డ్రైవింగ్‌ ట్రయల్‌కు ముందుగా కియోస్కీ ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌ నంబరు నమోదు చేసి టోకెన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత కంట్రోల్‌ రూమ్‌లో బయోమెట్రిక్‌ వేయాలి. అక్కడే శిక్షణకు వెళ్లేందుకు ట్యాగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్‌లోకి వెళ్లేముందు ఆర్‌ఎఫ్‌ రీడర్‌కు ట్యాగ్‌ను మ్యాచింగ్‌కు చేసి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చాక ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్‌ సిగ్నల్‌ను దాటకూడదు. సూచిక బోర్డులో ఉన్న విధంగానే 8, ఇతర ట్రాక్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సిగ్నల్‌ వద్ద ట్యాగ్‌ను మ్యాచింగ్‌ చేసి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను బట్టి 3 నుంచి 5 ట్రాక్‌లను పూర్తి చేయాలి. ఇలా శిక్షణ పూర్తి చేసి, వైట్‌ మార్క్‌ వద్దకు చేరుకున్న తరువాత స్టాప్‌ సిగ్నల్‌ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి తప్పు జరిగిన సెన్సార్‌ రూపంలో కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్తోంది. ఆటోమెటిక్‌ ట్రయల్‌లో తప్పిదం జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ విధానం ద్వారా అక్రమాలకు, దళారుల వ్యవస్థకూ చెక్‌ పడనుంది. 

పనులు పూర్తయ్యాయి 
ట్రాక్‌ పనులు గత ఆరు నెలలుగా చేస్తున్నారు. పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభం అవుతుంది. ఆటోమెటిక్‌ విధానం ద్వారానే ట్రయల్‌ ఉంటుంది. సెన్సార్‌ సాయంతో ఈ పరీక్షలు జరుగుతాయి. దీనిపై డ్రైవింగ్‌ శిక్షణకు వచ్చే వారు అవగాహన కలిగి ఉండాలి.    
– బసిరెడ్డి, డీటీసీ, చిత్తూరు    

మరిన్ని వార్తలు