పాపికొండలకు పోటెత్తారు 

7 Nov, 2022 03:31 IST|Sakshi
పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు

తొలిరోజు 112 మంది..  

ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పర్యాటకులు 

పోశమ్మగండి పాయింట్‌ నుంచి 2 బోట్లలో పయనం  

3 నెలల తర్వాత మొదలైన విహారం  

రంపచోడవరం/దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు ఆదివారం తొలిరోజే పర్యాటకులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నా ఎక్కువమంది టికెట్లు బుక్‌ చేసుకున్నారు. రెండు బోట్లలో 112 మంది పర్యాటకులు బయలుదేరారు. మూడునెలల విరామం తరువాత పర్యాటక, పోలీసు, రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారుల పర్యవేక్షణ, సూచనల మధ్య పాపికొండల పర్యాటకం ప్రారంభమైంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి బోట్‌ పాయింట్‌ నుంచి రెండు బోట్లు ఉదయం 11 గంటలకు బయలుదేరాయి. మొదటి బోటుగా గోదావరి గ్రాండ్‌లో 82 మంది ఉన్నారు. వీరిలో బోటు పైభాగంలో 46 మంది, లోపల 36 మంది కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండోబోటు భగీరథిలో 30 మంది పర్యాటకులు ఉన్నారు. వీరందరిని టికెట్‌ ఆధారంగా అనుమతించారు. తొలిరోజు కావడంతో బోట్లు బయలుదేరేందుకు కొంత ఆలస్యం అయింది. రోజూ ఉదయం 9 గంటలకే పర్యాటకులతో బోట్లు బయలుదేరతాయని అధికారులు చెప్పారు. బెంగళూరు నుంచి కూడా కొందరు పర్యాటకులు పాపికొండల విహారానికి వచ్చారు.  

చాలా ఆనందంగా ఉంది 
గోదావరిలో ప్రయాణించి పాపికొండల అందాలు చూడాలని కోరిక ఉంది. అయితే పాపికొండల రైడ్‌ క్యాన్సిల్‌ అయిందని చెప్పారు. తిరిగి పాపికొండలకు బోట్లు తిరుగుతాయని చెప్పారు. దీంతో 8 రోజులు టూర్‌ ప్లాన్‌ చేసుకుని వచ్చాం. పాపికొండల టూర్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది.      
– సుష్మ, పర్యాటకురాలు, బెంగళూరు 

జాగ్రత్తలు పాటించాలి.. 
పాపికొండల విహారయాత్రను విజయవంతంగా ముగించేందుకు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి. బోట్‌లో ప్రయాణించేటప్పుడు, తిరిగి బోట్‌ పాయింట్‌కు వచ్చేవరకు లైఫ్‌ జాకెట్లు తీయవద్దు. రోడ్డు ప్రయాణానికి, నీటిపై బోటులో ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గోదావరిలో బోటు వెళ్తున్నప్పుడు అటూ ఇటూ తిరగడం, అందరూ ఒకవైపు రావడం, తొంగిచూడడం చేయకూడదు. ఇలాచేస్తే బోటు ఒరిగిపోతుంది. సంతోషకరమైన ప్రయాణానికి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరం.     
– సురేష్‌బాబు, సీఐ రంపచోడవరం   

మరిన్ని వార్తలు