అమ్మకు శిక్షణ.. బిడ్డకు రక్షణ

12 Nov, 2023 04:20 IST|Sakshi

కేజీబీవీ టీచర్లకు బోధన నైపుణ్యాలపై శిక్షణ శిబిరాలు

అక్కడే వారి పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 

శిక్షణ కేంద్రాల వద్ద ‘ఎఫ్‌ఎల్‌ఎన్‌ కిడ్స్‌స్పేస్‌’ ఏర్పాటు 

ఆహారంతో పాటు సంరక్షకులను నియమించిన సమగ్ర శిక్ష అధికారులు 

విజయవాడ, విశాఖపట్నంలో ట్రైనింగ్‌ సెంటర్లు 

త్వరలో అనంతపురం, తిరుపతిలోనూ ఏర్పాటు 

తమ పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లపై టీచర్ల హర్షాతిరేకాలు

సాక్షి, అమరావతి:  పాలుతాగే పసికందులను వదిలి వెళ్లేందుకు ఏ మాతృమూర్తికీ మనసొప్పదు. పక్కింటికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంది. తప్పనిసరిగా వదిలి వెళ్లాల్సివస్తే మాత్రం బాగా కావాల్సిన వారికి మాత్రమే అప్పగిస్తుంది. కానీ.. ఉద్యోగం సాధించి, శిక్షణ కోసం వారం రోజులపాటు వదిలి ఉండాల్సి వస్తే..! సరిగ్గా ఇలాంటి తల్లుల ఇబ్బందిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారు శిక్షణ పొందుతున్న ప్రాంగణాల్లోనే ప్రత్యేక బేబీకేర్‌ సెంటర్ల (ఎఫ్‌ఎల్‌ఎన్‌ కిడ్స్‌స్పేస్‌)ను ఏర్పాటుచేసింది. పిల్లలు తినే ఆహారం.. ఏ సమయానికి ఏం తింటారు.. ఎప్పు­డు నిద్రపోతారు.. ఇలా అన్ని వివరాలను తీసుకుని ప్రత్యేకంగా పాలు, ఆహారం, ఆట వస్తువులతో పాటు కేర్‌ టేకర్లను సైతం నియమించింది.

ఉదయం ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యేటప్పుడు పిల్లలను ఈ కిడ్స్‌స్పేస్‌లో వదిలి తల్లులు ట్రైనింగ్‌కు హాజరై.. సాయంత్రం తిరిగి తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ బిడ్డకు ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను, సంరక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష అధికారులు తీసుకున్నారు. కొత్తగా కేజీబీవీల్లో చేరిన టీచర్లకు మరింత మెరుగ్గా బోధనా నైపుణ్యాలు అందించేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు విజయవాడ, విశాఖపట్నంలో శిక్ష­ణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చేటప్పుడు తమ పిల్లల బాధ్యత ఎలాగని బెంగపడ్డ టీచర్లు.. పిల్లల కోసం ప్రత్యే­క సెంటర్లను ఏర్పాటుచేయడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు.  

1,190 మంది కేజీబీవీ టీచర్లకు శిక్షణ  
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో బోధన కోసం 1,190 మందిని టీచర్లుగా నియమించింది. వారంతా దాదాపు 24 నుంచి 30 ఏళ్లలోపు వారే. వారికోసం విజయవాడ, విశాఖపట్నంలో ఫౌండేషన్‌ లెరి్నంగ్‌ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌)పై ఈనెల 6 నుంచి శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది చంటి పిల్లలతో రావడం, ఆ పిల్లలను ఎక్కడ ఉంచాలో తెలీక ఇబ్బందిపడ్డారు.

ఇది గమనించిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు వెంటనే అదే ప్రాంగణంలో ‘ఫౌండేషన్‌ లెర్నింగ్‌ అండ్‌ న్యూమరసీ కిడ్స్‌ స్పేస్‌’ సెంటర్లు ఏర్పాటుచేశారు. టాయ్స్‌ కార్నర్, హోలిస్టిక్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్, స్లీపింగ్‌ కార్నర్, స్టోరీ టెల్లింగ్‌ కార్నర్, మదర్‌/గార్డియన్‌ను అందుబాటులో ఉంచారు. టీచర్ల ఏకాగ్రత శిక్షణపై ఉండేలా పిల్లల సంరక్షణ బాధ్యత అధికారులే తీసుకోవడం ఇదే ప్రథమం.

గతంలో శిక్షణకు తాము మూడు నెలల బిడ్డలతో వచ్చి ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పిల్లల సంరక్షణను సమగ్ర శిక్ష అధికారులు తీసుకోవడం గొప్ప విషయమని సీనియర్‌ టీచర్లు సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడ, విశాఖపట్నంలో మొదటి విడత శిక్షణ ముగియడంతో ఈనెల 16 నుంచి అనంతపురం, తిరుపతిలో టీచర్ల శిక్షణ మొదలవుతుందని, అక్కడ కూడా ఇదే తరహా బేబీకేర్‌ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

తల్లులు ఇబ్బంది పడకూడదనే..
బాలికా విద్యాభివృద్ధే ధ్యేయంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేజీబీవీల ద్వారా నాణ్యమైన చదువుతోపాటు చక్కని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అక్కడ తల్లిదండ్రులకు, సంరక్షకులకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుతుంటారు. వారికి రక్షణతో పాటు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది.

అందుకే కొత్తగా చేరిన టీచర్లకు బోధనా నైపుణ్యాలతో పాటు విద్యార్థులు, సహచరులతో మెలగాల్సిన విధానాలపై శిక్షణ ఇస్తున్నాం. అయితే, ఈ శిక్షణ కేంద్రానికి కొందరు చిన్నపిల్లలతో వచ్చి ఇబ్బందిపడడం గమనించాను. వారి ఏకాగ్రత కోల్పోకుండా వారి పిల్లల సంరక్షణ బాధ్యతను మేం తీసుకుని బేబీ కేర్‌ సెంటర్లను ఏర్పాటుచేశాం. పిల్లలను చూసుకునేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలను సంరక్షకులుగా నియమించాం. 
– బి. శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఎస్పీడీ 

పిల్లల కోసం చక్కటి ఏర్పాట్లు.. 
ట్రైనింగ్‌ అనగానే సబ్జెక్టు వరకే ఉంటుందనుకున్నాను. టీచర్‌కు ఉండాల్సిన ఉత్తమ లక్షణాలను, విద్యా­ర్థు­లు, తోటి టీచర్లతో ఎలా ఉండాలి?, కమ్యూనికేషన్‌ స్కిల్స్, సైన్స్‌ ప్రయోగాలు, విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు ఎలా రాబట్టాలి వంటి అంశాలపై చక్కని శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కొందరు తమ పసిపిల్లలను తీసుకొస్తే అంగన్‌వాడీ ఆయాలు, ప్రథమ్‌ సభ్యులకు పిల్లల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. పిల్లల కోసం బెస్ట్‌ఫుడ్, ఆట వస్తువులు, నర్సులను అందుబాటులో ఉంచారు.    
– విజయ జాగు, కెమిస్ట్రీ పీజీటీ, నక్కపల్లి కేజీబీవీ (అనకాపల్లి జిల్లా) 

ఇంటి వాతావరణం తలపించేలా.. 
కేజీబీవీ టీచర్‌ శిక్షణ కోసం నాలుగు నెలల పాపతో వచ్చాను. కొత్త ప్రదేశం.. పైగా చల్లని వాతావరణం, పాప తట్టుకోలేదేమోనని ముందు భయపడ్డాను. ఒకవైపు శిక్షణ.. మరోవైపు పాప­ను చూసుకోవడం ఇబ్బంది తప్పదనుకున్నాను. కానీ, ఇక్కడ పిల్లల కోసం వేడినీళ్లు, పాలు, సెరిలాక్, ఆహారం వంటివి ఏర్పాటుచేశారు. ఆరోగ్య జాగ్రత్తల కోసం నర్సులను నియమించారు. కొంచెం పెద్ద పిల్లలకు ఆట వస్తువులు, బొమ్మలు ఏర్పాటుచేశారు. భోజనం, వసతి ఇంటిని తలపించేలా ఉంది.
 – హెచ్‌ఆర్‌. దివ్యశ్రీ,  తాడిమర్రి కేజీబీవీ, బోటనీ పీజీటీ (అనంతపురం జిల్లా)

మరిన్ని వార్తలు