దూసుకొచ్చిన మృత్యువు

17 Dec, 2023 08:39 IST|Sakshi

బొమ్మలసత్రం: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె వంతెనపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. గర్భిణిగా ఉన్న భార్యకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని సొంతూరుకు తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ కూడా దుర్మరణం చెందాడు. ట్రాఫిక్‌ సీఐ ఇస్మాయిల్‌ తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె పట్టణానికి చెందిన ఇక్బాల్‌ (36), ఆఫ్రిన్‌ దంపతులకు ఆప్స అనే రెండేళ్ల చిన్నారి ఉంది. ఇతను సొంతూరులోనే చెప్పుల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

ఆఫ్రిన్‌ రెండవ సారి గర్భం  దాల్చి నాలుగు నెలలు నిండటంతో నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యురాలి వద్ద చూయించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఇక్బాల్‌తో పరిచయమున్న భాస్కర్‌ ఆటోలో కుటుంబంతో సహా బయలుదేరారు. నూనెపల్లి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నూనెపల్లి బ్రిడ్జి నుంచి ఆటో కిందకు వస్తుండగా ముందున్న లారీ బ్రిడ్జి కుడివైపుకు నెమ్మదిగా తిరుగుతుండగా భాస్కర్‌ ఆటోను నిలిపాడు. అంతలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న ఐచర్‌ వాహనం ఆటోను బలంగా ఢీకొని ఎదురుగా ఉన్న లారీ వద్దకు ఈడ్చుకెళ్లింది.

 దీంతో ఆటో రెండు లారీల మధ్య చిక్కుకుని నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్‌ భాస్కర్‌ (42), ఇక్బాల్‌ (36) అక్కడికక్కడే మృతిచెందారు. ఇక్బాల్‌ భార్య ఆఫ్రిన్‌కు, కూతురు ఆప్సకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఐచర్‌ వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.  

>
మరిన్ని వార్తలు