ప్రాణ వాయువుకు ఫుల్‌‘పవర్‌’

16 May, 2021 06:06 IST|Sakshi

ఆక్సిజన్‌ ప్లాంట్లకు నిరంతర విద్యుత్‌ 

విద్యుత్‌ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు 

వివరాలు వెల్లడించిన ఇంధనశాఖ 

సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ప్రాణ వాయువు అందించే ఆక్సిజన్‌ తయారీ యూనిట్లకు నిరంతర విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు.

ఆస్పత్రులు, ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఇళ్లకు, మంచినీటి సరఫరా పథకాలకు విద్యుత్‌ సరఫరాపై ఆయన శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఒక్కో ఆక్సిజన్‌ కేంద్రానికి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను నోడల్‌ అధికారిగా నియమించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలో 22 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉన్నాయి. వాటికి 2,49,196 కేవీఏ(కిలో వోల్ట్‌ ఎంపియర్‌) మేర విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. 

విద్యుత్‌ సిబ్బందికీ వ్యాక్సినేషన్‌
నిరంతర విద్యుత్‌ కోసం వేలాది మంది ఇంజినీర్లు, సిబ్బంది, ప్రత్యేకించి ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. విద్యుత్‌ సరఫరా, ఇతర నిర్వహణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సీఎండీ నుంచి సీఈల వరకు పలువురు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా జిల్లా, మండల కార్యాలయాలను సందర్శిస్తున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా రోజూ క్షేత్ర స్థాయిలో విద్యుత్‌ సరఫరాపై సమీక్షించుకోవాలని సిబ్బందికి సూచిస్తున్నారు. విద్యుత్‌ సిబ్బందికి దశల వారీగా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 

>
మరిన్ని వార్తలు