ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఓ కళ నేర్పించాలి

10 Apr, 2022 08:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్‌ : ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగడంతో పాటు ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఏదైనా ఓ కళను నేర్పించి వారిలో సృజనాత్మకతకు బాటలు వేయొచ్చన్నారు. తద్వారా బాల్యం నుంచే చిన్నారుల్లో కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయత భావన అలవడుతాయని చెప్పారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన సంగీత, నాటక అకాడమీ అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.  2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు అవార్డులు ఒకేసారి అందజేశారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. బ్రిటీషర్ల అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృతిక రూపాలు ప్రభావవంతమైన రాజకీయ ఆయుధాలుగా ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి భారతీయ కళ, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

మల్లాదికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం
తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు(కర్ణాటక సంగీతం), ఎస్‌.కాశీం, ఎస్‌.బాబు(నాదస్వరం), పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి), కోట సచ్చిదానందశాస్త్రి(హరికథ)లు అవార్డులు అందుకున్నారు. 62వ జాతీయ ప్రదర్శన అవార్డుల్లో భాగంగా శిల్పకళల విభాగంలో జగన్మోహన్‌ పెనుగంటికి ఉపరాష్ట్రపతి అవార్డును అందజేశారు. కాగా, విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు తన తండ్రి శ్రీరామమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. వేలాది కచేరీలు నిర్వహించారు. నారాయణ తీర్థులు, రామదాసు, సదాశివబ్రహ్మేంద్రులు, అన్నమయ్య కీర్తనలకు స్వర రచన చేశారు. విజయవాడ ఆకాశవాణిలో సుదీర్ఘకాలం పనిచేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సంగీత, నాటక అకాడమీ, లలితకళ అకాడమీ అధ్యక్షురాలు ఉమ నందూరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు