చినబాబు ఫ్లాప్‌ షో..అందుకే చంద్రబాబు టాక్‌ షో..

10 Feb, 2023 04:53 IST|Sakshi
మంత్రి విడదల రజిని

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని 

యడ్లపాడు: రాజధాని గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆమె గురువారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత మనుషులకు దోచిపెట్టేందుకే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. నిజంగా ఆయనకు రాజధాని నిర్మించాలనే ఉద్దేశమే ఉంటే తాత్కాలిక భవనాలతోనే ఎందుకు సరిపెట్టారని ప్రశ్నించారు.

శాశ్వత నిర్మాణాల్లేకుండా, మౌలిక వసతులు కూడా కల్పించకుండా రాజధాని నిర్మించానంటూ కల్లబొల్లి కబుర్లు ఎన్నో అప్పట్లో చంద్రబాబు చెప్పారన్నారు. దీనివల్ల బాబు, ఆయన మనుషులు అక్కడ వ్యాపారం చేసుకుని లాభం పొందారని దుయ్యబట్టారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

నారా లోకేశ్‌ పాదయాత్రకు కనీస స్పందన కూడా లేదని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఆడియో వింటేనే వారి ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధితో ముందుకు వెళ్లాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని, మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు