దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని..

1 Apr, 2022 23:34 IST|Sakshi
పడుకున్న భక్తులపై దున్నపోతును నడిపిస్తున్న దృశ్యం   

కొత్తపల్లి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి ఏడాది మాదిరిగానే కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో పోలేరమ్మ తీర్థంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గురువారం ఉదయం దున్నపోతును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిని గరగ నృత్యాల మధ్య గ్రామమంతా ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు.

ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా నేలపై వరుసగా పడుకున్నారు. వారి మీదుగా దున్నపోతును నడిపించారు. ఓ భక్తురాలు కూడా వీరిని తొక్కుకుంటూ ముందుకు సాగింది. అలా మూడుసార్లు భక్తులు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా తొక్కించుకోవడం వలన వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు అలా చేయకుండా పూజల అనంతరం విడిచి పెట్టేస్తున్నారు. 

మరిన్ని వార్తలు