విశాఖ: ఇది ఆరంభం మాత్రమే.. నౌకల నిర్మాణంలో హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ కొత్త రికార్డు!

8 Feb, 2023 12:09 IST|Sakshi

డైవింగ్‌ సపోర్టు వెసల్‌ నిర్మాణంలో భారీ డీజిల్‌ జనరేటర్ల ఏర్పాటు 

నిస్టార్‌ షిప్‌ తయారు చేస్తూ ప్రయోగాత్మకంగా ప్రారంభం 

షిప్‌లో తొలిసారిగా 3 మెగావాట్ల డీజిల్‌ జనరేటర్‌ ఏర్పాటు 

రూ.2,100 కోట్ల ప్రాజెక్టులో వినూత్న ఆలోచనకు శ్రీకారం

నౌకల నిర్మాణం, మరమ్మతుల విషయంలోనూ హిందుస్థాన్‌ షిప్‌ యార్డు తనదైన ముద్ర వేస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో దూసుకుపోతూ.. మరోవైపు సాంకేతికతకు పదును పెడుతోంది. భారత నౌకాదళం కోసం నిరి్మస్తున్న షిప్‌లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్‌ జనరేటర్‌ ఏర్పాటు చేసి అబ్బురపరిచింది. 

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు జత కడుతున్న నేపథ్యంలోనౌకా నిర్మాణంలో హిందుస్థాన్‌ షిప్‌యార్డు సరికొత్త అధ్యాయాల్ని లిఖిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులు, నిర్మాణాలనైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్‌ షిప్‌యార్డు దేశంలోనే అతిపెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది.

తాజాగా భారత నౌకాదళం కోసం డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్‌ షిప్‌లో తొలిసారిగా 3 మెగావాట్ల భారీ డీజిల్‌ జనరేటర్‌ ఏర్పాటు చేసి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) భారత నౌకాదళానికి చెందిన షిప్‌ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచి్చంది. సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ నౌకా నిర్మాణం, మరమ్మతుల విషయంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. డీప్‌సీ డైవింగ్, సబ్‌మెరైన్‌ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐఎన్‌ఎస్‌ నిస్టార్, ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌ యుద్ధనౌకల్ని తయారు చేస్తోంది. తొలిసారిగా యుద్ధ నౌకలో 3 మెగావాట్ల డీజిల్‌ జనరేటర్‌ ఏర్పాటు చేసి చారిత్రక అధ్యాయాన్ని లిఖించింది. ఐఎన్‌ఎస్‌ నిస్టారాలో గురువారం ఉదయం ఈ భారీ జనరేటర్‌ని ఏర్పాటు చేశారు.  

సాధారణంగా ప్రతి యుద్ధ నౌకలోనూ 5 జనరేటర్లు ఉంటాయి. నిర్మాణ సమయంలో మొదటి జనరేటర్‌ సేవలు ప్రారంభిస్తే.. నౌకానిర్మాణం దాదాపు పూర్తయినట్లేనని భావిస్తారు. ఈ జనరేటర్‌ ప్రారంభమైతే.. షిప్‌కు కావాల్సిన విద్యుత్‌ ఉత్పత్తి మొదలవుతుంది. ఇప్పటివరకూ 2 మెగావాట్ల డీజిల్‌ జనరేటర్లు మాత్రమే వినియోగించారు. కానీ.. నిస్టార్‌కు మాత్రం 3 మెగావాట్ల జనరేటర్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. షిప్‌యార్డు డిజైన్‌ మేనేజర్‌ ఉషశ్రీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కారి్మకులు నిరంతరం శ్రమించి దీనిని రూపొందించారు. ఈ జనరేటర్‌ ప్రారంభంతో నిస్టార్‌ షిప్‌ పనులు 90 శాతం వరకూ పూర్తయ్యాయని షిప్‌యార్డు వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఐఎన్‌ఎస్‌ నిస్టార్‌ను భారత నౌకాదళానికి అప్పగించేందుకు షిప్‌యార్డు బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ యుద్ధనౌక నిర్మాణ ప్రాజెక్టును రూ.2,100 కోట్ల వ్యయంతో హెచ్‌ఎస్‌ఎల్‌ చేపడుతోంది. 

మరిన్ని వార్తలు