ప్రమాదాలకు బ్లాక్‌‘స్పాట్‌’  | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు బ్లాక్‌‘స్పాట్‌’ 

Published Wed, Dec 27 2023 5:19 AM

Most accidents in black spot areas on highways - Sakshi

సాక్షి, అమరావతి: వాహనాల్లో హైవేలపై రివ్వున దూ­­సు­కుపోవడం సరదాగానే ఉంటుంది కానీ, అదే హైవేలపై బ్లాక్‌స్పాట్లు (ప్రమాదకర ప్రదేశాలు) య­మ­పాశాలుగా మారుతున్నాయి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు హైవే బ్లాక్‌ స్పాట్ల వద్ద సంభవిస్తున్నాయి. దేశంలో హైవేలపై ఐదేళ్లలో బ్లాక్‌ స్పాట్ల వ­ద్ద ఏకంగా 39,944 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 18,476 మంది దుర్మరణం చెం­దారు. ప్రస్తుతం దేశంలో 5,803 బ్లాక్‌ స్పాట్లు ఉ­న్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎ­న్‌హెచ్‌ఏఐ) నివేదికలో వెల్లడించింది. బ్లాక్‌ స్పా­ట్ల­ను సరిచేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొంది.   

బ్లాక్‌ స్పాట్లను సరిదిద్దేందుకు ప్రాధాన్యం 
జాతీయ రహదారులపై బ్లాక్‌స్పాట్ల ప్రమాదాలను నివారించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణను వేగవంతం చేసింది. గుర్తించిన బ్లాక్‌ స్పాట్లను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన చర్యలు చేపడుతోంది. అందుకోసం పోలీసులు, రవాణా శాఖల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో జాతీయ రహదారుల విస్తరణ, రోడ్లకు మరమ్మతులు,  ప్రమాదకర మలుపుల సమీపంలో చెట్ల తొలగింపు, సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర చర్యలు వేగవంతం చేస్తోంది. ఆ ప్రమాదాల్లో హైవే పెట్రోలింగ్‌ను కూడా పెంచింది. గత ఐదేళ్లలో దేశంలో మొత్తం 3,972 బ్లాక్‌ స్పాట్లను సరిచేశారు.   

బ్లాక్‌ స్పాట్‌ అంటే..  
భారతీయ రోడ్‌ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా జాతీయ రహదారి 500 మీటర్ల పరిధిలో గడి­చిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జ­రి­గి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీ­వ్రంగా గాయపడినా దానిని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు.   

మొదటి స్థానంలో తమిళనాడు 
బ్లాక్‌ స్పాట్లు, రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యలో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న 748 బ్లాక్‌ స్పాట్ల వద్ద 6,230 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 2,144 మంది దుర్మరణం చెందారు.  701 బ్లాక్‌ స్పాట్లతో రెండోస్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 3,572 రోడ్డు ప్రమాదాల్లో 1,990 మంది ప్రాణాలు కోల్పోయారు. 551 బ్లాక్‌ స్పాట్లతో మూడోస్థానంలో ఉన్న కర్ణాటకలో 4,110 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 1,694 మంది మృతి చెందారు. ఆ జాబితాలో తెలంగాణ నాలుగోస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ ఐదోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 485 బ్లాక్‌ స్పాట్లలో సంభవించిన 3,965 రోడ్డు ప్రమాదాల్లో 1,672 మంది దుర్మరణం చెందారు. ఏపీలోని 466 బ్లాక్‌ స్పాట్లలో 2,202 రోడ్డు ప్రమాదాల్లో 1,273 మంది ప్రాణాలు విడిచారు.

Advertisement
Advertisement