1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు

13 May, 2021 05:32 IST|Sakshi

7 ఏఐబీపీ ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన ఆయకట్టుకూ వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు

రూ.971.39 కోట్లతో బ్రాంచ్‌ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలపై ప్రభుత్వం దృష్టి

ఇప్పటికే ముగిసిన టెండర్ల ప్రక్రియ.. వచ్చే ఏడాదికి పనులు పూర్తి

2022 ఖరీఫ్‌లో 7 ప్రాజెక్టుల కింద ఆయకట్టంతా సాగులోకి

సాక్షి, అమరావతి: సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) ద్వారా చేపట్టిన ఏడు ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు కూడా నీళ్లందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుల కింద బ్రాంచ్‌ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయడం ద్వారా మిగిలిన ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.971.39 కోట్లతో చేపట్టింది. ఇప్పటికే బ్రాంచ్‌ కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన జలవనరుల శాఖ అధికారులు తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి పనులను పూర్తి చేసి ఏడు ప్రాజెక్టుల కింద మిగిలిన 73,380 హెక్టార్ల (1,81,326 ఎకరాలు) ఆయకట్టుకు 2022 ఖరీఫ్‌లో నీళ్లందించేలా ప్రభుత్వం సన్నద్ధమైంది.

2009 నాటికే 4.76 లక్షల ఎకరాలకు నీటి సరఫరా..
సత్వర సాగునీటి ప్రయోజన పథకం ద్వారా 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుండ్లకమ్మ, ముసురుమిల్లి, పుష్కర, తాడిపూడి, తారకరామతీర్థసాగరం, ఎర్రకాల్వ ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో తారకరామతీర్థసాగరం మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ అప్పట్లోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల కింద 2,66,110 హెక్టార్లకుగానూ 1,92,730 హెక్టార్ల (4,76,245 ఎకరాలు) ఆయకట్టుకు ఇప్పటికే నీళ్లందించారు. పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీ) పనులు పూర్తికాకపోవడం వల్ల మరో 73,380 హెక్టార్ల ఆయకట్టుకు మాత్రం నీళ్లందించలేకపోయారు. 2009 తర్వాత మిగిలిన పనులను పూర్తి చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలం కావడంతో ఆయకట్టు అంతటికీ నీళ్లందించలేని దుస్థితి నెలకొంది.

రైతులందరికీ ప్రాజెక్టుల ఫలాలు..
పూర్తయిన ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన ఆయకట్టుకు కూడా నీళ్లందించడం ద్వారా రైతులందరికీ జలయజ్ఞం ఫలాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించేందుకు చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ఆదేశించింది. మిగిలిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వాటిని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయకట్టు భూమిని చదును చేయడంతోపాటు సూక్ష్మనీటిపారుదల పథకం కింద యాజమాన్య పద్ధతుల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసి తక్కువ నీటితో ఆయకట్టు అంతటికీ సమృద్ధిగా నీరు సరఫరా చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. 

>
మరిన్ని వార్తలు