చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారా?.. కారణం ఇదే కావచ్చు..!

21 Sep, 2022 19:10 IST|Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా : అల్జీమర్స్‌ ఈ పేరు చాలా మందికి తెలియదు. వయస్సు పైబడిన వారిలో మతిమరుపు అంటే.. ఓ అదా అంటారు. ఈ సమస్య ఉన్న వారు ఆ రోజు జరిగే చిన్న చిన్న విషయాలు మరిచిపోతుంటారు గానీ ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి గుర్తుకు తెచ్చుకుని మరీ చెబుతుంటారు. ఇలాంటి వ్యాధితో బాధపడే వారు ఒకరుంటే ఆ కుటుంబం మొత్తం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒంట్లో సత్తువ క్షీణించి, జ్ఞాపకశక్తి నశించిన మనుషులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ అల్జీమర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
చదవండి: వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్‌ వర్కర్లదే..! 

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మానసిక విభాగం, ఇతర ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో సైకియాట్రిస్ట్‌ల వద్దకు వచ్చే వారిలో ప్రస్తుతం 10 శాతానికి పైగా అల్జీమర్స్‌తో బాధపడే వారు ఉంటున్నారు. ఇలాంటి వారికి అడ్మిషన్‌ అవసరం ఉండదు. ఓపీలో మందులు, కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించేస్తారు. అయితే డిమెన్షియాతో బాధపడే వారికి మందులతో పాటు ఒక్కోసారి అడ్మిషన్‌ అవసరం అవుతుంది. కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స ఇచ్చాక ఇంటికి పంపిస్తారు.

పెరుగుతున్న బాధితుల సంఖ్య  
అల్జీమర్స్‌ దాదాపు 60 నుంచి 80 శాతం మతిమరుపు జబ్బులకు కారణం అవుతుంది. ఇది వారి కుటుంబసభ్యులపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా అల్జీమర్స్‌ 65 సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది. ఇటీవల 65 ఏళ్లలోపు వారూ దీని బారిన పడుతున్నారు. ఈ జబ్బు ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో భారత్‌  ఉంది. 65 ఏళ్లు పైబడిన వారిలో 5 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండగా వయసుపెరిగే కొద్దీ 80 ఏళ్ల వయస్సు వారిలో 20 శాతం మందికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

అల్జీమర్స్‌ లక్షణాలు 
కళ్లద్దాలను, ఇంటి తాళాలను ఎక్కడో భద్రంగా పెట్టి మరిచిపోతారు. కుటుంబసభ్యుల పేర్లు కూడా మరిచిపోతుంటారు. మాట్లాడేటప్పుడు పదాల కోసం తడుముకుంటారు. కొద్దినిమిషాల కిందటే జరిపిన సంభాషణను కూడా మరిచిపోతుంటారు. అడిగిపవే పదేపదే అడగడం, ఎక్కువసేపు నిద్ర, మెలకువగా ఉన్నా పనులపై ఆసక్తి చూపరు. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడతారు.

అల్జీమర్స్‌కు కారణాలు 
మతిమరుపు జబ్బు వారసత్వంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది.  
మెదడులో ‘అసిటైల్‌ కోలిన్‌’ అనే రసాయన ద్రవం తగ్గడం, సాధారణ ప్రొటీన్లు మెదడు కణజాలంలో చేరడం వల్ల సంక్రమిస్తుంది 
దీర్ఘకాలంగా ఆల్కహాల్‌ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం, అకారణంగా నిద్రమాత్రలు వాడడం వల్ల కూడా వస్తుంది 
సంవత్సరాల కొద్దీ మానసిక ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదుపులో లేని బీపీ, షుగర్‌ వల్ల సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది.

మతిమరుపులన్నీ అల్జీమర్స్‌ కాదు    
మతిమరుపు లక్షణాలు పలు రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధుల వల్ల కూడా రావచ్చు. మతిమరుపు మాత్రమే అల్జీమర్స్‌ కాదు. ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి వ్యాధి లక్షణాలు పరిశీలించడమే గాక కొన్ని నిర్థిష్టమైన పరీక్షలు కూడా నిర్వహిస్తాం. రోగి ఏకాగ్రత స్థాయిని, గ్రహింపు శక్తిని, జ్ఞాపక శక్తిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తాం. జన్యుపరమైన, వైద్యపరమైన కారణాలను కనుగొనేందుకు బ్రెయిన్‌ ఇమేజింగ్, రక్తపరీక్షలు వంటివి నిర్వహించాల్సి వస్తుంది. అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాతనే రోగికి అల్జీమర్స్‌ వ్యాధిపై ఒక నిర్ధారణకు వచ్చి తగిన చికిత్స అందిస్తాం. ఈ వ్యాధితో బాధపడే వారిని చిన్నచూపు చూడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్‌ నిషాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, కర్నూలు

కచ్చితమైన వైద్యం లేదు 
అల్జీమర్స్‌కు కచ్చితమైన, పూర్తిగా నయం చేసే వైద్యం ఇంతవరకు అందుబాటులో లేదు. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అల్జీమర్స్‌తో బాధపడే వారితో పాటు కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా జబ్బున పడ్డ వారిని ఎలా నియంత్రించాలో కుటుంబసభ్యులు శిక్షణ తీసుకోవాలి. మెదడును పదును పెట్టే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన పోషకాహార అలవాట్లు పాటించాలి.  
– డాక్టర్‌ కె.నాగిరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, కర్నూలు  

మరిన్ని వార్తలు