మనసుకూ జబ్బులొస్తాయి!

9 Oct, 2023 04:19 IST|Sakshi

సందర్భం

మన దేశ జనాభాలో దాదాపు రెండు కోట్ల మందికి పైగా పలురకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మానసిక వైద్యుల సంఖ్య చాలా తక్కువే. అర్హత పొందిన మానసిక వైద్యులు కేవలం పదివేల మంది మాత్రమే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి సంఖ్య నాలుగు వందల లోపే! శరీరంలో ఏదైనా భాగా నికి జబ్బు చేస్తే, వెంటనే ఆయా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాము.

కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తించినా, మాట్లాడినా, కుంగిపోయినా, అది కూడా ఒక జబ్బేననీ, దానికి కూడా శాస్త్రీయమైన చికిత్స ఉందనీ, వైద్యనిపుణులు కూడా ఉన్నారనీ ఇప్పటికీ చాలామందికి తెలి యదు. ఒకవేళ తెల్సినా, మానసిక డాక్టరు దగ్గరికి వెళ్తే పిచ్చిపట్టిందని చులకనగా చూస్తారనే భయంతో తొలి దశలోనే చికిత్స చేయించుకోక, ముదర పెట్టుకుంటారు. ఇంతేకాకుండా, దయ్యం, గాలి సోకిందనో, చేతబడి చేశారనో, మందు పెట్టారనో అపోహలతో, మూఢనమ్మకాలతో నాటు వైద్యులు, మంత్రవైద్యులతో వైద్యం చేయించుకొని వ్యాధి బాగా ముదిరిన తర్వాత డాక్టర్ల దగ్గరకి వెళ్తుంటారు. 

ఇతర శరీర భాగాల్లాగా కాకుండా మనసనేది కంటికి కనబడని ఒక ప్రత్యేకమైన అవయవం. మనసనేది మెదడు లోని అంతర్భాగమేనని శాస్త్రీయంగా నిర్ధారించిన విష యమే! మెదడు ‘హార్డ్‌వేర్‌’ అయితే మనసు ‘సాఫ్ట్‌వేర్‌’.‘కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ కనబడకపోయినా, దాని పనితీరు తెలిసినట్లే, మనసనేది కనబడకపోయినా, దాని ప్రవర్తన, ఆలోచనాతీరు, భావోద్వేగాలు, నిర్ణయాత్మక శక్తి లాంటి వన్నీ బయటికి తెలుస్తూనే ఉంటాయి. శరీరానికి, మనసుకు అవినాభావ సంబంధ ముంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటే, శారీరక జబ్బులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవు.  

మానసిక వ్యాధులు వచ్చే ముఖ్య కారణాల్లో వారసత్వంగా వచ్చేవి, మెదడు లోపాలు, మద్యం, మత్తు, మందుల అలవాటు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం లేకపోవడం, తల్లితండ్రుల పెంపకంలో లోపాలు ముఖ్య మైనవి. మానసిక వ్యాధులంటే కేవలం ‘పిచ్చి’ అనే అపోహ చాలామందికి ఉంది.

వందల రకాల మానసిక వ్యాధుల్లో ‘పిచ్చి’ (ఉన్మాదం) కేవలం ఒక రకమే! ఆందోళన, టెన్షన్, నిద్రలేమి, దిగులు, మనోవేదన, లేనిపోని భయాలు, అతిశుభ్రత లాంటి చాద స్తాలు, మద్యపానం, డ్రగ్స్‌కు బానిసలు కావడం, ఆత్మహత్యా ప్రయత్నాలు, మన స్పర్ధలతో దంపతులు సర్దుకుపోలేకపోవడం, లైంగిక సమస్యలు. భ్రమలు,భ్రాంతులు, అకారణంగా ఇతరులను అనుమానించడం, దయ్యం–గాలిసోకినట్లు ఊగి పోవడం, ఇంకా చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజవ్‌ు, హైపరాక్టివిటీ, మొండితనం, అతికోపంతో తిట్టడం, కొట్టడం లాంటి పలురకాల లక్షణాలన్నీ మానసిక రుగ్మతలే నంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగవచ్చు. 

మానసిక వైద్యులు కేవలం నిద్రమాత్రలే ఇస్తారనే అపోహ ప్రజల్లో ఉంది. అది పూర్తిగా తప్పు. నిద్ర రావడమనేది ఆ మందుల ఫలితాల్లో ఒక లక్షణమే తప్ప అవి నిద్రమాత్రలు కాదు. ఆ యా జబ్బుల్లో ఉన్న మూల కారణాలను సరి చేసి, ఆ వ్యక్తిని మానసిక ఆరోగ్యవంతుడిని చేస్తాయి. ఒకప్పటి కరెంటు చికిత్సతో పాటు, ఇటీవలే వచ్చిన ఆర్‌టీఎమ్‌ఎస్‌ అనే మేగ్నటిక్‌ చికిత్స కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కౌన్సెలింగ్‌ పద్ధతుల్లో, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ, మైండ్‌ఫుల్‌నెస్‌ థెరపీ, డీబీటీ, సీఆర్‌టీ, వర్చువల్‌ రియాలిటీ థెరపీ లాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి.

ఎవరికి ఎలాంటి చికిత్స అవసరమన్నది అర్హత గల మానసిక వైద్య నిపుణులే నిర్ణయిస్తారు. ఎంబీబీఎస్‌ తర్వాత మానసిక వైద్యశాస్త్రంలో మూడేళ్ళు ఎమ్‌డీ లేదా డీఎన్‌బీ కోర్సు చేసిన వారినే ‘సైకియాట్రిస్టు’ లంటారు. రోగ నిర్ధారణకు తగిన పరీక్షలు చేసి మందులతోపాటు  కౌన్సిలింగ్‌ చేసే శిక్షణ సైకియాట్రిస్టులకే ఉంటుంది. ‘సైకాల జిస్టు’లంటే సైకాలజీలో ఎమ్మెస్సీ లేదా ఎమ్‌ఫిల్‌ క్లినికల్‌ సైకాలజీ చేసినవారు. వీరు మానసిక రోగులకు కౌన్సెలింగ్‌తో పాటు తెలివితేటల నిర్ధారణ, వ్యక్తిత్వ నిర్ధారణ లాంటి మానసిక పరీక్షలు మాత్రమే చేస్తారు. రోగనిర్ధారణ,మందులు ఇవ్వడం లాంటివి వీరు చేయకూడదు.

మానసిక రోగుల సంక్షేమం కొరకు, కేంద్రప్రభుత్వం 2017లో ‘మెంటల్‌ హెల్త్‌కేర్‌ యాక్ట్‌’ అనే ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో ‘స్టేట్‌ మెంటల్‌ హెల్త్‌ అధారిటీ’నీ, జిల్లా స్థాయిలో ‘రివ్యూ బోర్డ్స్‌’ను ఏర్పాటు చేశారు. దేశంలో మానసిక వైద్యం అవసరమైన ప్రతి వ్యక్తికీ చికిత్స చేయించి, ఆ ఖర్చు భరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలదేనని ఈ చట్టంలో పేర్కొన్నారు.

అలాగే ఆదరణ, కూడు, గూడు లేకుండా వీధుల్లో తిరిగే అనాథ మానసిక రోగులను కూడా చేరదీసి వైద్యం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! ప్రతి సంవత్సరం అక్టోబర్‌ పదవ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకొంటూ, ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించే ప్రయత్నాన్ని మానసిక నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ‘వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌’ పిలుపు ఇచ్చిన సందర్భంగా, సమాజంలో మానసిక అనారోగ్యంపై, మూఢనమ్మకాలపై పోరాడ దామని అందరం ఈ సందర్భంగా ప్రతిన బూనుదాం! 
డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి 
వ్యాసకర్త ప్రముఖ సైకియాట్రిస్ట్‌
(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)

మరిన్ని వార్తలు