World Snake Day 2022: ఎన్నాళ్లు ఇలా.. కనపడితే ఖతం చేస్తున్నారు!

16 Jul, 2022 15:31 IST|Sakshi

సాక్షి ,భామిని(పార్వతిపురం మన్యం): సరీసృపాల్లో సర్పజాతిపై అవగాహన లోపంతో అవి అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేస్తున్న చోటే అవగాహన లోపంతో వాటిని అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తిన్న పాము పగ పడుతుందనే అభూత కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతమారుస్తున్నారు.


గ్రామస్తుల చేతిలో హతమైన భారీ కొండచిలువ 

పంట కాపాడే పాములు రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలు కలు, పందికొక్కుల నివారణ లో కీలక పాత్ర ధారి పాముకు మనుగడ కష్టమైపోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన జీవిగా గుర్తింపు పొందినా వాటికి తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

క్రిమి సంహారక మందుల ప్రభావం  
ప్రధానంగా వ్యవసాయ రంగంలో వినియోగించే క్రిమి సంహారక మందుల ప్రభావం, ఆదునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు లేకుండా చేయడంతో  పాముల సంచారం   కష్టమైంది.  

విష సర్పాలు తక్కువ.. 
మన చుట్టూ తిరుగుతున్న పాములలో  80 శాతం విషంలేని సాధారణ  సర్పాలే ఉన్నాయి. విçషపూరితమైనవి, ప్రాణాంతకం కలిగించేవి కొద్దిగానే ఉన్నాయి. నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము),రక్తపింజర,కట్లపాము, పొడపాములను విషసర్పా లుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  

పాములపై అవగాహన అవసరం  
విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదరం కావని తెలియజేయాలి. పాము పగ పడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా చైతన్యం కల్పించాలి. స్నేక్స్‌ ఫ్రెండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను హరించడం తగదు. కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచిపెట్టాలి. అవి అంతరించకుండా చూడాలి.

పాములన్నీ విషసర్పాలు కావు  
పాములన్నీ విషసర్పాలు కావు. అన్ని పాములకు విషం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోతామనే భయం వీడాలి. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివారించే ఏంటీస్నేక్‌ వీనమ్‌(ఏఎస్‌వీ) మందులు అందుబాటులో ఉన్నాయి.  పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం.
– డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు,డిప్యూటీ డీఎంహెచ్‌ఓ,సీతంపేట

పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి 
పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్‌ రెస్క్యూ టీం  తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం.అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్‌ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది.సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది.హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9848414658కు తెలియ పర్చండి. పాములను చంపడం చట్టరీత్యానేరం.1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కఠిన శిక్షలు తప్పవు.      
– కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ వన్యప్రాణ సంరక్షణ గస్తీ బృందం 

చదవండి: Gujarat Riots: గుజరాత్‌ అల్లర్ల వెనుక షాకింగ్‌ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్‌ ప్లాన్‌!

మరిన్ని వార్తలు