నిబద్ధతకు చిరునామా సీఎం జగన్‌

13 Nov, 2021 07:31 IST|Sakshi

సాక్షి, ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): నిబద్ధతకు నిలువుటద్దంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిలుస్తారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అన్నారు. ఏయూ టీఎల్‌ఎన్‌ సభా మందిరంలో డాక్టర్‌  జీకేడీ ప్రసాద్‌ వ్యాస సంకలనం ‘జనం కంటిరెప్ప జగన్‌’ పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..  పుస్తక రచయిత జీకేడీని అభినందించారు.

అధికార భాషా సంఘం సభ్యుడు, ఏయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ రెండేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనంగా పుస్తకం తీసుకురావడం మంచి పరిణామమన్నారు. ఏయూ పాలక మండలి సభ్యురాలు గిరిజా అగస్టీన్‌ మాట్లాడుతూ.. వారి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని  గుర్తు చేసుకున్నారు. మేఘం వర్షాన్ని, విత్తు పంటని, వైఎస్‌ రాజశేఖర రెడ్డి వైఎస్‌ జగన్‌ మోహన రెడ్డిని మనకు ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ పరిపాలన అందిస్తున్నారన్నారు.  

 పుస్తక రచయిత డాక్టర్‌ జీకేడీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పరిపాలనపై ప్రత్యేక కవితా సంపుటిని త్వరలో తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలపై కవితలు ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తమ కవితలకు నగదు పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. సంబంధిత పోస్టర్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఆవిష్కరించారు.  సెంటర్‌ ఫర్‌ డెమొక్రసీ పబ్లికేషన్‌ చైర్మన్‌ కె.వెస్లీ, ఏయూ హెచ్‌ఆర్‌డీసీ సంచాలకులు ఆచార్య ఎన్‌ఏడీ పాల్, న్యాయ కళాశాల ఆచార్యులు డి.సూర్యప్రకాశ రావు, పుస్తక ప్రచురణకర్త, బీహెచ్‌.ఎస్‌.ఆర్‌ అండ్‌ వి.ఎల్‌ డిగ్రీ కళాశాల సెక్రటరీ–కరస్పాండెంట్‌ డి.సువర్ణరాజు పాల్గొన్నారు.

    

మరిన్ని వార్తలు