ఇప్పుడిది రైతాంధ్ర

27 Oct, 2021 02:38 IST|Sakshi
కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గతంలో రైతుల ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలొచ్చేవి

ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూసేందుకు వస్తున్నాయి

రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, యాంత్రీకరణ పథకాల కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌

ఆర్బీకేలు ప్రతి అడుగులో రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి

అన్నదాతలు నష్టపోకుండా 29 నెలల్లో గణనీయమైన మార్పులు తెచ్చాం

రైతన్నకు ఇంతకుముందు కరువులు, కాటకాలు మాత్రమే తెలుసు 

దేవుడి దయతో వర్షాలు కురిసి కరువు సీమ సైతం సస్యశ్యామలమైంది

కరోనా సవాల్‌ విసిరినా రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు

వారి కళ్లలో ముందే దీపావళి చూడాలని 3 పథకాల నిధులు విడుదల చేస్తున్నాం

ఐఏఎస్‌ల్లో చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవి. మీరంతా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఐఐటీ వరకూ మీరు చేరుకోగలిగారు. ఇలాగే కష్టపడి చదివితే కచ్చితంగా ఐఏఎస్‌ల స్థానాల్లో కూర్చుంటారు. మీకు ఏం కావాలన్నా తగిన సహకారం అందిస్తాం. గిరిజన, వెనకబడిన ప్రాంతాల నుంచి కలెక్టర్లు వస్తే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చదివే పరిస్థితి వస్తుంది.  
– విద్యార్థులతో సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: రైతుల కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వ్యవస్థ వ్యవసాయ రంగంలో గొప్ప మార్పులను తెచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపే గొప్ప వ్యవస్థను నెలకొల్పి స్పష్టమైన మార్పు తెచ్చామన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యల పరిశీలనకు కేంద్ర బృందాలు వచ్చేవని, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలను చూసేందుకు ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి బృందాలు ఏపీకి వస్తున్నాయని, ఇది మన కళ్ల ముందే కనిపిస్తున్న గొప్ప మార్పు అని గుర్తు చేశారు. కరోనా సవాల్‌ విసిరినా రైతుల కోసం అడుగులు ముందుకేస్తూ అండగా నిలిచామన్నారు.

వ్యవసాయం పండుగగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానని, రైతుల కళ్లలో దీపావళి కాంతులు ముందుగానే చూడాలని ఆకాంక్షిస్తూ మూడు పథకాల నిధులను ఇప్పుడే విడుదల చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్రసేవా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ పథకాల ద్వారా రైతులకు దాదాపు రూ.2,190 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్టైంది. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ...

రైతన్నల కళ్లల్లో ముందే దీపావళి వెలుగులు
ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు భరోసా ద్వారా దాదాపు 50.37 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా మూడో సంవత్సరం అక్టోబరులో ఇవ్వాల్సిన డబ్బులను జమ చేస్తున్నాం. రైతు భరోసా కింద గత ఆగస్టులో విడుదల చేసిన డబ్బులతో కలిపి ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో రూ.2,052 కోట్లు ఇస్తున్నాం. రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం నెరవేరుస్తూ వచ్చామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నా.

కౌలు రైతులకు సైతం రైతు భరోసా..
ఈ రెండున్నరేళ్లలో ఒక్క రైతు భరోసా పథకానికే దాదాపుగా రూ.18,777 కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమిని సాగు చేస్తున్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ... 
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు రూ.112.70 కోట్లను సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా రూ.లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఇందులో గత సర్కారు సున్నా వడ్డీ కింద ఎగ్గొట్టిన బకాయిలు రూ.1,180 కోట్లు కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతో చెల్లించాం.

కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు...
వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద ఈరోజు 1,720 రైతు గ్రూపులకు అంటే ఒక్కో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీనిద్వారా రైతులు నిర్దేశించిన సరసమైన అద్దెకే  యంత్రసేవలు వారికి అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా ఐదు చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్టాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను (సీహెచ్‌సీలను) అందుబాటులోకి తెస్తున్నాం. 

29 నెలల్లో గణనీయమైన మార్పులు..
ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే.. ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తెచ్చామన్నది ఈ సందర్భంగా మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.  

29 నెలల్లో రైతుల కోసం ఎన్నెన్నో..  
9,160 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో కూర్చొబెట్టాం. త్వరలో మిగిలిన ఆర్బీకేల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా బ్యాంకులతో చర్చిస్తున్నాం.  
► కరోనా సవాల్‌ విసిరినప్పటికీ మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వమిది. కరువుసీమలో సైతం ఈరోజు నీరు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో రైతన్నలు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.   
► రైతులు నష్టపోకూడదని మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ తెచ్చాం. మద్దతు ధర రాక పొగాకు రైతులు ఇబ్బంది పడుతుంటే కొనుగోళ్లలో జోక్యం చేసుకుని బాసటగా నిల్చాం. ఆర్బీకే స్ధాయిలోనే సీఎం యాప్‌ (కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌) అందుబాటులోకి తెచ్చాం. కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలకు కనీస మద్దతు బాటు ధరలు కల్పించాం.  
► రైతు భరోసా కేంద్రాలను వన్‌ స్టాప్‌ సెంటర్లుగా (అన్ని అవసరాలు తీర్చే) తీర్చిదిద్దాం.  
► వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు ద్వారా రైతులకు అన్ని విధాలుగా సలహాలు, సూచనలు ఇచ్చి.. ప్రతి అడుగులో తోడుగా నిలుస్తున్నాం.   
► ఇ– క్రాపింగ్‌ ద్వారా పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, పంటల కొనుగోళ్లు లాంటివి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం.  
► కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు మంజూరు చేస్తూ మార్కెటింగ్‌ వ్యవస్థలో ఏఎంసీలను కూడా ఆధునికీకరిస్తున్నాం. వాటిలో కూడా నాడు–నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం.  
► రాష్ట్రంలో దాదాపు 18.7 లక్షల మంది రైతులకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3,716 కోట్లు అందించగలిగాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. 
► రైతులకు పాల వెల్లువ, వైఎస్సార్‌ జలకళ.. ఆక్వా రైతులకు కరెంట్‌ సబ్సిడీ ద్వారా తోడుగా నిలిచాం. 

జేఎఫ్‌ కెన్నడీ ఏమన్నారంటే..  
ఎక్కడైనా.. ఏ దేశంలోనైనా రైతు తాను పంట పండించడానికి కావాల్సిన అన్నింటినీ ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్‌గా కొనుగోలు చేస్తాడు. తాను కష్టపడి పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు హోల్‌సేల్‌గా అమ్ముకునే పరిస్ధితి నెలకొందని అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్‌ కెన్నడీ అప్పట్లోనే చెప్పారు. మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించు ఇదే పరిస్థితులున్నాయి. ఆ పరిస్థితిని మనం మారుస్తున్నాం. 

పొలం వద్దకే ఆర్బీకే సిబ్బంది
గిరిజన రైతునైన నాకు మీరు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన వెంటనే వైఎస్సార్‌ రైతు భరోసా మూడు దఫాలు అందింది. చాలా అనందంగా ఉన్నాం సార్‌. వైఎస్సార్‌ తరువాత ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు మీ ప్రభుత్వంలో ఇచ్చారు. పోడు వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వాలు పంటలు వేయకూడదని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నాం. గిరిజన రైతులంతా మీకు రుణపడి ఉంటారు.  ఆర్‌బీకే సిబ్బంది నేరుగా పొలానికే వచ్చి అన్ని నేర్పుతున్నారు.  
–ఎం.విశ్వేశ్వర రావు, తడిగిరి గ్రామం, హుకుంపేట మండలం,  విశాఖపట్టణం జిల్లా

ఇప్పుడు అన్నీ గ్రామంలోనే
మీరు రైతాంగానికి వెన్నెముకలా నిలిచారు. వ్యవసాయ అధికారులు మా దగ్గరకు వచ్చి పంటల గురించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆక్వా, మొక్కజొన్న, పామాయిల్‌ రైతులు ఆనందంగా ఉన్నారు. కరెంట్‌ బిల్లులు కట్టలేని సమయంలో వైఎస్సార్, మీరు చేసిన సాయం మరువలేం. ఇప్పుడు అన్నీ మా గ్రామంలోనే అందుతున్నాయి. 
–కొండే లాజరస్, పెదపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

మా కళ్లలో ఆనందం 
రైతు భరోసా ద్వారా మీరు అన్నదాతల కళ్లలో ఆనందం నింపారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుతున్నాయి. గతంలో కర్నూలు వెళ్లి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామాల్లోనే అన్నీ అందుతున్నాయి. 
–శ్రీదేవమ్మ, లక్ష్మీదేవిపురం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా

రైతులపై ప్రేమ మరోసారి చాటారు... 
సీఎం సార్‌.. మీరు చెప్పారంటే చేస్తారంతే అని రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి దీపావళి కంటే ముందే రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, యంత్ర సేవా పథకం సబ్సిడీని ఇవ్వడం ద్వారా రైతులపై మీ ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఈరోజు దేశమంతా రాష్ట్రం వైపు చూస్తోంది. రైతు భరోసా కేంద్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతిఆయోగ్‌ కూడా అధికారులను పిలిచి అభినందించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి ఆర్బీకే మోడల్‌ను తాము కూడా అనుసరిస్తామంటున్నారు. కేవలం రైతులకు ఇన్‌పుట్స్‌ ఇవ్వటానికే పరిమితం కాకుండా ఆర్బీకేలను విజ్ఞాన కేంద్రంగా, సేవా నిలయాలుగా మార్చడం గొప్ప విషయం.
 – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

మరిన్ని వార్తలు