Yadadri Temple City: 250 విల్లాలు.. ఒక్కోటి 2 కోట్లు

27 Oct, 2021 02:23 IST|Sakshi
టెంపుల్‌ సిటీపై ఏర్పాటు చేసిన విల్లాల లేఅవుట్‌  

భక్తుల వసతిపై వైటీడీఏ దృష్టి

భారీగా వసతి గృహాల నిర్మాణానికి సన్నాహాలు 

ప్రతి విల్లాలో నాలుగు సూట్లు 

సాక్షి, యాదాద్రి: మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో భక్తులకు వసతి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా టెంపుల్‌ సిటీలో భారీ వసతి గదుల నిర్మాణానికి వైటీడీఏ (యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ) సన్నాహాలు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ ఈనెల 19న యాదాద్రి పనులను స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. తిరుమలకు వచ్చే భక్తులు కుటుంబాలతో మూడు, నాలుగు రోజులు కొండపై ఉంటున్న విధంగా.. యాదాద్రికి వచ్చే భక్తులు కూడా బస చేయడానికి 250 కాటేజీల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో ఆలయం సమీపంలో ఉన్న పెద్దగుట్టపై టెంపుల్‌సిటీని పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అక్కడ రూపొందించిన లేఅవుట్‌లలో చేపట్టనున్న వసతి గదుల నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యాదాద్రి కొండకు ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై 900 ఎకరాల్లో టెంపుల్‌ సిటీని నిర్మించనున్నారు. మొదటగా 250 ఎకరాల్లో రూ.207 కోట్లతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 250 ప్లాట్లలో విశాలమైన విల్లాల నిర్మాణం కోసం 40 మందికి పైగా దాతలు ముందుకొచ్చారు. 

ముందుగా విల్లాల నిర్మాణం 
భక్తుల వసతి కోసం ముందుగా విల్లాల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విల్లాలో నాలుగు సూట్లు ఉంటాయి. టెంపుల్‌సిటీలో నిర్మించే ప్రతి బ్లాక్‌కు దేవతల పేర్లు పెట్టనున్నారు. ప్రస్తుతం 250 ఎకరాల్లో లేఅవుట్‌ సిద్ధంగా ఉంది. మరో 650 ఎకరాల్లో లేఅవుట్‌ను సిద్ధం చేయబోతున్నారు. వీటితోపాటు ప్రస్తుతం అభివృద్ధి చేసిన టెంపుల్‌ సిటీలో మంచినీరు, రోడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వసతుల కల్పన పూర్తి చేశారు. సుందరీకరణ, గ్రీనరీ పనులు కూడా పూర్తి చేశారు. ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం భక్తులకు కనువిందు చేయనుంది.  

ఐదు రకాల నిర్మాణాలు : పెద్దగుట్టపై ఐదు రకాల అధునాతన కాటేజీలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఒక్కో విల్లాను రూ.2 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. ‘ఎ’టైప్‌ నుంచి ‘డి’టైప్‌ వరకు పూర్తిగా ఏసీ కాటేజీలు నిర్మిస్తున్నారు. నాన్‌ ఏసీ కేటగిరీలో ‘ఇ’టైప్‌ కాటేజీలు ఉంటాయి. ముందుగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చే దాతల పేరిట ‘ఎ’టైప్‌ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. అలాగే రూ.కోటి విరాళం ఇచ్చే దాతల పేరిట ‘బి’టైప్, రూ.50 లక్షలు ఇచ్చేవారి పేరిట ‘సి’టైప్, రూ.25 లక్షలు విరాళం ఇచ్చేవారి పేరిట ‘డి’టైప్‌ కాటేజీల నిర్మాణాలు జరగనున్నాయి. 

విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు 
పెద్దగుట్ట మీద నిర్మించే విల్లాల కోసం విరాళాలు ఇవ్వడానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 250 విల్లాలు నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో విల్లా విలువను రూ.2 కోట్లుగా నిర్ణయించాం. ఇప్పటికే 40 మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. దాతలు బ్యాంకుల్లో విరాళాలు చెల్లించవచ్చు.  
– కిషన్‌రావు, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ 

మరిన్ని వార్తలు