కృష్ణా జలాలపై తగ్గేదే లేదు 

10 Oct, 2023 04:41 IST|Sakshi

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే పరమావధి 

కేడబ్ల్యూడీటీ–2కు కేంద్రం కొత్త మార్గదర్శకాలపై ప్రధాని, హోంమంత్రికి లేఖలు 

జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం 

ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష 

తాజా మార్గదర్శకాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించిన అధికారులు 

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని ఇప్పటికే నిర్ణయం  

సాక్షి, అమరావతి: కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయో­జనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని జల వన­రుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిశాని­ర్దేశం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బ్రిజేష్‌­కుమార్‌ ట్రిబ్యు­నల్‌ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్‌ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖలు రాయాలని ఆదేశించారు.

రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవ­సరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధి విధానాలపై సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయా­లని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాల­యంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశి­భూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

కృష్ణా జలాల పంపిణీపై గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ (కేడ­బ్ల్యూ­డీటీ–1), బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూ­డీటీ–2) చేసిన కేటాయింపులపై సమగ్రంగా చర్చి­ంచారు. కేడబ్ల్యూ­డీటీ–2 తదుపరి నివేదిక ద్వారా మిగులు జలాల కేటా­యింపుల్లోనూ రాష్ట్రా­నికి నష్టం జరిగిన అంశంపైనా చర్చి­ం­చారు. ఈ పరి­ణా­మాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘా­త­మని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.

విభజన చట్టానికి విరుద్ధం
కేంద్ర మార్గదర్శకాలు విభజన చట్టం సెక్షన్‌–­89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరు­ద్ధంగా ఉన్నా­యని అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపు­లకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం స్పష్టం చేస్తుంటే.. దీనిని ఉల్లంఘించేలా కేంద్రం మార్గదర్శకాలు ఉన్నా­య­ని వివరించారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు పలు పిటి­షన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేంద్రం గెజిట్‌ నోటిఫి­కేషన్‌ జారీ చేసిందని చెప్పారు.

అలాగే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాజ్‌–4ను కూడా కేంద్రం ఉల్లంఘించిందని, 2002కు ముందు చేసిన కేటాయింపులను, పంపకాలను పునః­పరిశీలించరా­దని ఈ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపారు. గోదా­వరి జలాల కేటాయింపులను ఇంకో బేసిన్‌కు తర­లించుకోవచ్చన్న వెసులు­బాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణనలోకి తీసు­కుని ఆమేరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు కేటా­యింపులు చేసే అంశాన్ని కూడా కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివ­రించారు.

అదే తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న­ప్పటికీ, ఆ మేరకు కృష్ణా జలాలను అదనంగా మన రాష్ట్రానికి కేటా­యించేలా కేడబ్ల్యూడీటీ–2కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడంపైనా సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేప­ట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మార్గనిర్దేశం చేశారు.

మరిన్ని వార్తలు