హస్తకళా వైభవం.. చెక్క కళ భళా!

17 Oct, 2022 10:55 IST|Sakshi

దేశవిదేశాలకు ఎగుమతి  అవుతున్న చెక్క నగిషీ వస్తువులు∙

కళాకారిణి గౌసియాబేగంకు వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు 

ఉదయగిరి(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా):  రాచరిక సామ్రాజ్య కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో ఇప్పుడు ఆ ప్రాభవ వైభవం కనిపించకపోయినా హస్తకళా వైభవానికి కొదువ లేదు. చెక్కపై చెక్కిన కళాత్మక వస్తువులు తయారు చేస్తున్న ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఉదయగిరి దిలావర్‌భాయి వీధిలోని హస్తకళల అభివృద్ధి కేంద్రంగా తయారయ్యే వస్తువులకు ఖండాంతర ఖ్యాతి ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తకళ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది.  

150 కుటుంబాలకు జీవనోపాధి 
చెక్క నగిషీ వస్తువుల తయారీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తుండడంతో ప్రస్తుతం 150 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వందేళ్లకు పూర్వం ఒకట్రెండు కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగించాయి. ఉదయగిరి హస్తకళల కేంద్రంతో తయారయ్యే వివిధ రకాల వస్తువులకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన చేతివృత్తుల ఎగ్జిబిషన్‌లో ఉదయగిరి కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి అబ్బురపడి ప్రశంసలు అందించారు.  

కళకు ప్రాణం పోసిన అబ్దుల్‌బషీర్‌  
తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న షేక్‌ అబ్దుల్‌బషీర్‌ తన 24వ ఏట ఈ వృత్తిలోకి ప్రవేశించి వివిధ రకాల వస్తువులను తయారు చేయం ప్రారంభించారు. దీనిపై ఇతరులు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలు గౌసియాబేగం, ఫాయిదాలకు నేర్పించారు. 2003లో 15 మంది సభ్యులు సంఘంగా ఏర్పడి చైతన్యజ్యోతి వెల్ఫేర్‌ సొసైటీ ద్వారా ఉడెన్‌ కట్టరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ మినిస్టరీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఆర్థిక సాయం అందించారు.  

ప్రశంసల జల్లులు
ఈ కళకు ఊపిరిపోసిన అబ్దుల్‌బషీర్‌కు లేపాక్షి, హస్తకళల అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు అందజేశారు. ఆయన కూతురు షేక్‌ గౌసియాబేగంకు కూడా ఇదే సంస్థ ఆమె ప్రతిభను గుర్తించి వివిధ బహుమతులు అందించారు. తాజాగా కేంద్రం నిర్వాహకురాలు షేక్‌ గౌసియాబేగంకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసింది.  

200 రకాలు పైగా వస్తువుల తయారీ
ఉదయగిరి దుర్గం, కొండ ప్రాంతాల్లో లభించే లద్ది, బిల్లనద్ది, కలువ, బిక్కి, దేవదారు తదితర అటవీ కర్రను ఉపయోగించి ఈ వస్తువులు తయారు చేస్తారు. ఈ కొయ్య ద్వారా స్పూన్లు, ఫోర్కులు, అట్లకర్ర, గరిటెలు, డైనింగ్‌ టేబుల్స్, ఫొటో ఫ్రేమ్స్, పిల్లలు ఆడుకునే వివిధ రకాల వస్తువులు, వివిధ వస్తువులు నిల్వ చేసుకునేందుకు ఉపయోగించే ట్రేలు, చిన్న గిన్నెలు, ప్లేట్లు, దువ్వెనలు తదితర 200 రకాల వస్తువులు తయారు చేస్తున్నారు.  

ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటు చేసి ఆధునిక మెషిన్లు సమకూర్చాలి. తద్వారా ఎక్కువ మంది ఈ వృత్తిలోకి ప్రవేశించి తమ ఆదాయం పెంచుకునే వీలుంటుంది.  
–  షేక్‌ గౌసియా బేగం 

మరిన్ని వార్తలు